నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌
ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): నెల్లూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సహకారశాఖ అధికారులను ఆదేశించారు.జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పిఎసిఎస్‌ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పిఎసిఎస్‌లను నాబార్డు జాతీయ సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్కుకు అనుసంధానం చేసిందని, అందువల్ల కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని సూచించారు. జిల్లాలో 54 పిఎసిఎస్‌లలో 2,03,236 మెంబర్‌షిప్‌లు, 25,914 రికార్డులు అప్‌లోడ్‌ చేయడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా సెప్టెంబరులోగా పూర్తి చెయ్యాలన్నారు. జిల్లాలో కొత్తగా మల్టీపర్పస్‌ డెయిరీ, సహకార, మత్స్య సహకార సంఘాల కంప్యూటరీకరణకు జిల్లా ప్రణాళిక సిద్ధం చేసి ప్రణాళిక అమలుకు లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్యం నిల్వ కేంద్రాల నిర్మాణానికి జిల్లాలో కోవూరు మండలం పడుగుపాడు పిఎసిఎస్‌ పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక కోసం సొసైటీ కమిటీ రిజల్యూషన్‌ చేసి కేంద్ర ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. దీనిలో వ్యవసాయ మౌలిక సదుపాయాలైన గోడౌన్‌లు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, చౌకధర దుకాణాలు, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల క్రింద ఒకచోట ఏర్పాటు చేయడం జరుగుతుందని, పిఎసిఎస్‌ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి గ్రామీణ ప్రాంతాలలో ఎల్‌పిజి పంపిణీ, పెట్రోల్‌ పంపులు అవుట్‌లెట్ల ఏర్పాటు కోసం ఐదు పిఎసిఎస్‌లను గుర్తించడం జరిగిందని వాటి ఏర్పాటుకు అన్ని  లైసెన్సులు పొంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరో 5 పి ఎ సి ఎస్ లలో పి ఎం జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జేసీ సేదు మాధవన్‌, డిసిఒ గుర్రప్ప, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, మత్స్యశాఖ జెడి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జెడి కోటేశ్వరరావు, డిపిఓ సుస్మిత, నాబార్డు, సహకార బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.