శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించా
వినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడి
సెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత దంపతులు అరెస్టై జైలుకు వెళ్లిన విషయం విధితమే. తాజాగా శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినుత కోటా డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) సంబంధించిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయుడు హత్యకు గురికాక ముందు తీసిన వీడియో నెట్టింట ఆదివారం హల్ చల్ చేసింది. వీడియోలోని రాయుడు కొన్ని విషయాలను వెల్లడించారు. శ్రీకాళహస్తి యం.ఎల్.ఏ బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుండి టచ్ లో ఉన్నట్టు, జనసేన నాయకులు పేట చంద్ర శేఖర్, కొట్టే సాయి ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి లు రాయుడు ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లినట్టు తెలిపాడు. వినుత కోటా కి సంబంధించి రాజకీయ పరమైన, వ్యక్తిగత పరమైన అన్ని విషయాలు నవంబర్ 2023 నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి చేరవేసి నందుకు 2024 ఎన్నికల ఫలితాల ముందు తనకి 20 లక్షలు ఇచ్చారని తెలిపారు. వినుత కోటా , చంద్రబాబు కోటాలని చంపాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించాడని , రెండు సార్లు కారు ఆక్సిడెంట్ చెయ్యడానికి ప్రయత్నించానని,కుదరలేదని ఆ వీడియోలో రాయుడు తెలిపాడు. ఒకసారి నేరుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడుని కలిసి వినుత కోటా, చంద్రబాబు కోటా ప్రైవేట్ వీడియోలు తియ్యాలని బెదిరించి , భయపెట్టి, మరో 30 లక్షలు డబ్బులు ఆశ చూపి చెయ్యమన్నాడని వెల్లడించారు. ఈ క్రమంలో తాను బెడ్రూం లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయానని సంచలన విషయాలు సెల్ఫీ వీడియోలో లో తెలిపాడు. అయితే ఈ హత్య వెనుక జనసేన నాయకులు పేట చంద్ర శేఖర్, పేట చిరంజీవి, దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టిడిపి నాయకుడు సుజిత్ పేర్లు వినవస్తున్నాయి. కోటా వినుత దంపతులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళున్న సందర్భంలో వినుత దంపతులు మీడియాతో మాట్లాడుతూ రాయుడు హత్యకు ప్రధాన కారణం టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని వారు ప్రకటించిన విషయం విదితమే. అలాగే శ్రీకాళహస్తీశ్వరా దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి జనసేన కు చెందిన కొట్టే సాయి ప్రసాద్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటన విలువడిన సందర్భంలో వినూత కోటా జనసేన అధినేత, డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తూ కొట్టే సాయి మహిళలు అంటే గౌరవం లేదని, ఇలాంటి వ్యక్తికి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వవద్దు, పార్టీ కోసం కష్టపడిన ఎంతో మంది వున్నారని వారికి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోట వినుత చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా కొట్టే సాయి ప్రసాద్ కు దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి జనసేన ఇంచార్జి కోటా వినూతకు అని చివరికి టిడిపి నేత బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో వినుత కోటా తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయం కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం, శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించ్చారు. ఎమ్మెల్యే ఎన్నికలు ఫలితాలు వెళ్ళడైన రాత్రే టిడిపి నాయకులు తన ఇంటి ముందు టపాకాయలు కాల్చి తన నివాసం వద్ద గందరగోళం చేస్తూ అవహేళన చేస్తూన్నారని కోటా వినుత, ఆమె భర్త చంద్రబాబులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి అటు టిడిపి ఇటు జనసేనలోని కొంత మంది వినూత కోటా దంపతుల కదలికలు కనిపెడుతూ వారి ఎత్తులను అనూహ్యంగా చిత్తు చేస్తూ వచ్చారు. దీంతో వినుత కోటా ఎక్కడో పొరపాటు జరుగుతోందని తలచి ఆత్మపరిశీలనలో పడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత వారి అనుమానం నిజమైంది. ఎక్కడో కాదు తన నివాసంలోనే, అందునా తన కారు డ్రైవర్ రాయుడు నుంచి అని గ్రహించి రాయుడును ఒక రూములో బందించి ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించడం, సరిగా సమాధానం రాకపోవడంతో కొట్టి, భయపెట్టి, క్రమంలో రాయుడు హత్యకు గురైయ్యాడు. పోలీసులు తమిళనాడు లోని ఓ నదిలో రాయుడు మృత దేహాన్ని గుర్తించి రాయుడు చేతిపై వున్న పచ్చ బొట్టు ఆధారంతో వినూత కోటా దంపతులను అరెస్ట్ చేశారు. అప్పటి జిల్లా ఎస్ పి హర్ష వర్ధన్ రాజు కేసు తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారని, వారికి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే జనసేన నుంచి వినూత ను సస్పెండ్ చేసిన విషయం జగద్వితమే. మొత్తం మీద రాయుడు హత్యకు ముందు తీసిన వీడియో ఆదివారం నట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పలు అనుమానాలు వినవస్తూ వున్నాయి. రాయుడు వీడియో ప్రభావం తెలుగుదేశం జనసేన పార్టీల నాయకుల పైన ఎలా ఉంటుంది..? ఎవరిపై వేటు పడుతుంది..? అసలు కొట్టే సాయి ప్రసాద్ దేవస్థానం చైర్మన్ గా ప్రమాణం చేస్తారా..? లేక దేవాదాయ శాఖ ఆదేశాల్లో వున్న రెండవ నెంబర్ అయిన బీలా స్రవంతి చైర్మన్ గా అవుతారా..? లేకపోతే మరో సభ్యునికి చైర్మన్ హోదా లభిస్తుందా? అనే అనుమానం సర్వత్రా వినిపిస్తోంది. రాయుడు వీడియో ప్రభావం ఎవరెవరికి పాప భీతి పట్టుకుంది. ఈ కేసుల్లో ఎవరికీ శిక్ష పడుతుంది అనే కోటి డాలార్ల ప్రశ్నలకు సరైన సమాధానం కోసం నియోజకవర్గం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తూ వున్నారు.