గూడూరు లో పోలీస్ స్టేషన్ లలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
ప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): విధుల నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశించారు. గూడూరు ను నెల్లూరు జిల్లా లో విలీనం అయిన తరువాత మొదటి సారిగా గురువారం గూడూరు కి విచ్చేసిన ఎస్పీ పోలీసు స్టేషన్లోని పరిపాలనా వ్యవస్థ, కేసుల నమోదు విధానం, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, పోలీసు శాఖపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.నేరాల నియంత్రణ,రౌడీ షీటర్లు, అనుమానితులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. స్టేషన్లో నమోదైన పెండింగ్ కేసులు, కోర్టు సంబంధిత కేసుల స్థితిగతులు, ఎఫ్ఎఆర్లు,స్టేషన్ హౌస్ రికార్డులు, సీజ్ చేసిన వస్తువుల భద్రత వంటి అంశాలను ఎస్పీ ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో నమోదు చేసి, న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, వన్ టౌన్ సిఐ శేఖర్ బాబు, రూరల్ సి.ఐ కిషోర్ బాబు, ఎస్సైలు మనోజ్ కుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు.