సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు ప్రభాతదర్శిని, (రేణిగుంట-ప్రతినిధి): విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు కోరారు. బుధవారం ఆయన రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఎం శ్రీ పాఠశాలలో కిచెన్ గార్డెన్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించారు. తరగతి గదుల నిర్మాణం పై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తరగతులను జరిపించడానికి తగిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులతో త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పీఎం శ్రీ నిధుల ద్వారా పాఠశాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చు చేశారో ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నవో వివరాల కోసం సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సారధి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, పిజి టీచర్ మోహన్ నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.