ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి) : వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో వన్ విలేజ్.. 4 విజిట్స్, రెవెన్యూ పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, పిజిఆర్‌ఎస్ అర్జీలు, యూరియా నిల్వలు, చాంపియన్ ఫార్మర్ కార్యక్రమం, గృహ నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై ఆర్డీవోలు, కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు, రైతులు తెలియజేసిన రెవెన్యూ సంబంధిత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమం నిర్వహించిన గ్రామాల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా సమస్యల పరిష్కారం జరగాలని స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. చాంపియన్ ఫార్మర్లను ప్రోత్సహిస్తూ, వారి ద్వారా మిగిలిన రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పిజిఆర్‌ఎస్ అర్జీలను నాణ్యంగా, బాధ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి ఎండార్సుమెంట్లు ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని తెలిపారు. పరిష్కారం సాధ్యం కాకపోతే స్పష్టమైన కారణాలతో కూడిన ఎండార్సుమెంట్‌ను అర్జీదారునికి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన నాణ్యతలోపం ఉన్న గృహ నిర్మాణాలను సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని మరమ్మతులు పూర్తి చేయించాలని హౌసింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ విజయ్‌కుమార్, జడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, పశుసంవర్థక శాఖ జెడి రమేష్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
