ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) :..యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసుల శాఖ,( సెట్నెల్) వారి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ యోగి వేమన బోధనలు సమాజానికి మార్గదర్శకాలని అన్నారు. వేమన రచించిన యోగి వేమన శతకం, తత్త్వ శతకంలలోని భావాలు నేటి సమాజానికి అత్యంత ముఖ్యమని, యువత వాటిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. యోగి వేమన తన బోధనల ద్వారా తెలుగు సాహిత్యంలో, సమాజ చైతన్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసి మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్వో విజయకుమార్, సెట్నెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.