అమరులైన మాదిగ పోరాటా యోధలకు అంకితం
ఈ తీర్పుతో న్యాయం మా వైపు ఉందని రుజువైంది
పోరాటంలో సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు
మీడియా ముందు భావోద్వేగానికి గురైన మందకృష్ణ

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్వాగతించారు. కీలక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా, వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు ఇలాచాలామంది సహాయం చేశారని గుర్తు చేశారు. ఈ విజయం కోసమే 30ఏళ్లుగా పోరాటం చేశాం. ఎందరినో ఉద్యమ కారులను కోల్పోయామన్నారు. అయినా పట్టువ దలకుండా ఉపవర్గీకరణ సాధించుకున్నామని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయితే ఇదిఒకరి గెలుపో ఇంకొకరి ఓటమో కాదన్నారు. దళితుల అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. రానురాను ప్రభుత్వ రంగాల్లో వర్గీకరణ పరిధి తగ్గిపోతుందని అది పెంచేందుకు అందరి నాయకులు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడిం చింది. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ‘మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ పక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం.రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయ బోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ.. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణా మాదిగ వెల్లడించారు.