ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): గొప్ప మానవతావాది మూఢ సిద్ధాంతాలను, నమ్మకాలను, కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమేనని అందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని, స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన బీసీ ఉద్యోగుల సమాఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో టి గోపాల్ మాట్లాడుతూ శనివారం తిరుపతిలో పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో కొందరు పెరియార్ జీవిత చరిత్ర పుస్తకాలు ప్రదర్శన ప్రాంగణంలో ఉండకూడదని వివాదం సృష్టించిన సంఘటన దురదృష్టకరమని ఇది వారి అజ్ఞానానికి ఛాందస మూఢనమ్మకాలకు నిదర్శనమని అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 16 ప్రకారం దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ సమానత్వం ఉన్నదని తనకు నచ్చిన భావజాలాన్ని, మతాన్ని అనుసరించే హక్కు ఉన్నదని గోపాల్ తెలిపారు. బి సి ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ సృష్టిలో జన్మతః మనుషులందరి సమానమేనని వారికి కుల ప్రతిపాదికన ఉత్తమలని అదమలని వేరుచేసి అంటరానితనాన్ని అంటగట్టి వేరేగా చూడటం దుర్మార్గం అన్నారు. మనుషులను మనుషులుగా చూడకుండా విడదీసే సందర్భంలో నిమ్న కుల ఉద్యమ నాయకుడిగా దక్షిణ భారతదేశంలో పెరియార్ సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారని తెలిపారు. బిసి ఈ ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు మార్కంటి గణేష్ బాబు మాట్లాడుతూ విజ్ఞానము పెరిగిన ఈ రోజుల్లో కూడా మతతత్వ వాదులు ఛాందస భావాలతో మానవ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. సామాజిక విప్లవకారుడు మానవత్వానికి ప్రతిరూపం రామస్వామి నాయకర్ పెరియర్ అని తెలిపారు. ఆయన వారసులుగా భారతదేశంలో 80 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారని ఆ ఛాందసవాదులకు హెచ్చరిక చేశారు. బి సి ఈ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంకీ పురం పవన్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తూ మనుషుల్ని కులాల పేరుతో చిన్న చూపు చూస్తూ కొన్ని రాజకీయ భావజాల వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయని ఇది సమాజానికి శ్రేయస్కారం కాదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిసి ఈ ఎఫ్ జిల్లా కోశాధికారి సునీల్ దత్త, నాయకులు గోపి, వినోద్ కుమార్, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.