ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లే ఔట్ల అప్రూవల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి నుడా ఆదాయ, వ్యయాలను మంత్రికి నుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు. కావలి, కందుకూరుల్లో ఎం ఐజీ లే ఔట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నుడా, కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై ప్రధానంగా సమీక్షించామన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన టిడ్కో ఇళ్ల పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. 163 చోట్ల టిడ్కో పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. జూన్ కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 43 వేల టిడ్కో ఇళ్లను మార్చి లోపు సిద్ధం చేస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అమృత్, యూ ఐ డీ ఎఫ్ కింద రాష్ట్రంలో 13 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూ.800 కోట్లతో పనులు జరగనున్నాయని స్పష్టం చేశారు. నెల్లూరును ముంపునుంచి తప్పించాలంటే కాలువలపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ఆక్రమణదారులు సహకరించాలని కోరారు. పేదలు ఇళ్ళు కోల్పోతే ప్రత్యామ్నాయం చూపుతామని మాటిచ్చారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. డంపింగ్ యార్డులు లేని ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని పెట్టి వెళ్లిందని మండిపడ్డారు. అయితే సీఎం చంద్రబాబు గారు అపార అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని 100 శాతం నెరువేరుస్తామన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.
ఆర్ ఎస్ ,బీపీఎస్ ద్వారా మధ్యతరగతి వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. దిన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలనీ నిర్లక్ష్యం వహిస్తే నష్టం తప్పదన్నారు. LRS అమలులో మంత్రి ఆదేశాలను తూచా తప్పక అమలు చేస్తామన్నారు.కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికొదిలేసిందనీ అవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ సహకారంతో సర్వతో ముఖాభివృద్దికి బాటలు వేస్తున్నామనీ వెల్లడించారు. ఎం ఐజీ లే అవుట్ లు ,ఎల్ ఆర్ ఎస్ ,బిపిఎస్ ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామనీ స్పష్టం చేశారు. అనంతరం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ సూచనలతో ముందుకు వెళుతున్నామన్నారు.ప్రజా ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందనీ తెలిపారు.రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కట్టడాల క్రమబద్దీకరణకు కూటమి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందన్నారు. నెల్లూరు వాసులు సద్వినియోగం చేసుకోవాలనీ పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలనీ విజ్ఞప్తి చేశారు. మంత్రి నారాయణ సహకారంతో రూరల్ లో రైల్వే అండర్ బ్రిడ్జిలు సాధిస్తామన్నారు.ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పార్కులు ఏర్పాటు చేస్తున్నామనీ ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మంత్రి చొరవతో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి కార్పొరేషన్ లో జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,ఇంటూరి నాగేశ్వర రావు, కమీషనర్ నందన్ ,కావలి ,కందుకూరు మున్సిపల్ కమీషనర్లు , టౌన్ ప్లానింగ్ ,ఇంజనీరింగ్ ,పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.
