నిల్వ ఆహార పదార్థాల వడ్డింపే సంఘటనకు కారణమా?
వాంతులు,విరోచనాలతో 11 మంది విద్యార్థులకు అస్వస్థత
నెల రోజుల్లో 2వ సారి ఘటనతో విద్యార్థుల ఆందోళన

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో నెల రోజుల్లో రెండవ సారి అతిసార విజంభించింది. దీంతో 11 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత పాలయ్యారు. వైద్య చికిత్సల కోసం విద్యార్థులను హాస్పిటల్ తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు మరి కొంతమంది విద్యార్థులు అతిసార వ్యాపిస్తుందన్న భయంతో ఇంటి బాట పడుతున్నారు. జూలై నెలలో కలుషిత ఆహారం తిని సుమారు 135 మంది విద్యార్థులు అతిసార బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో సమాచారం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పలువురు నాయకులు నాయుడుపేట గురుకులాన్ని సందర్శించి అస్తవ్యస్తంగా ఉన్న వంటగదులు, దుర్గంధ భరితంగా ఉన్న మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మంత్రి ఆదేశాల మేరకు సుమారు 35 లక్షల రూపాయలతో గురుకులంలో మౌలిక వసతులు మెరుగు పరచేందుకు అభివృద్ధి పనులు చేపట్టారు. రెండు రోజుల క్రితం నాయుడుపేట తాసిల్దార్ గీతావాణి గురుకుల పాఠశాలను పరిశీలించిన సందర్భంగా దుర్గంధ భరితంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆదివారం భోజనంలో చికెన్ తిన్న విద్యార్థులకు అతిసార వ్యాపించింది. పేదవిద్యార్థులకు భోజన వసతి కల్పించడం తోపాటు ఉన్నతమైన ప్రమాణాలతో విద్యనందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు గురుకులాన్ని పరిశీలించి,మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకత తీసుకుంటున్నప్పటికీ రెండవసారి అతిసార విజృంభించడం పై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యానికి తోడు గురుకుల అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తరచూ గురుకులంలో అతిసార వ్యాపిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. నాసిరకం వంట సరుకులతో పాటు నిల్వ ఉన్న చికెన్ లను వండి వడ్డించడం వల్లే అతిసార వ్యాపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం వస్తువులతో పాటు నిల్వచేసిన ఆహార పదార్థాలు, చికెన్ వంటి వాటిని విద్యార్థులకు పెట్టకూడదన్న నిబంధన నాయుడుపేట గురుకులంలో అమలు కావడం లేదని తెలిసింది.నాయుడుపేట గురుకులంలో తరచూ అతీసార వ్యాపించి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నా అటు గురుకులం అధికారుల్లోనూ ఇటు ఫుడ్ కాంట్రాక్టర్ లోను ఎలాంటి మార్పు రావడం లేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరోవైపు కొందరు విద్యార్థులు బయటి నుంచి బిరియాని తీసుకొని తినడం వలన ఈ ఘటన చోటు చేసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే నిజమైతే విద్యార్థులు బయటి ఫుడ్ తీసుకొచ్చేందుకు వారిని ఎవరు అనుమతించారో తెలియజేయవలసి ఉంది. ఆ సమయంలో ఎవరు డ్యూటీ ఉన్నారో తెలుస్తుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉంది. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టి, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.