
నిబంధనల పట్టించుకోకపోవడం దారుణం
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం సరికాదు
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్ ఖండన
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్ అన్నారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పీవీ సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో, వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడటానికి వెళ్లారు. అయినా సస్పెండ్ చేయడం కేవలం ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం కనీసం నోటీసు జారీ చేయకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం సరైనది కాది ఆక్షేపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెనుకబడిన వర్గాల అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదని, ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడమన్నది పాలకులు గుర్తించుకోవాలని విజయ్‌కుమార్ హితవు పలికారు.