ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పదిమంది కోసం పనిచేసేవారు ఎక్కడో ఒక చోట ఉంటారని, అలాంటి వారిని గుర్తించి సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పి4 కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆదివారం బిజిఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సహకారంతో గునపాటి రమేష్ రెడ్డి కృషితో ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని బిసి కాలనీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలకు స్థానిక నాయకులు, గునపాటి అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్మశాన వాటికలో చేపట్టిన కర్మ క్రతువుల భవనం, సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్, దహనవాటికలను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచి మనసున్న మనిషి రమేష్ రెడ్డి అని, ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నారు. గతేడాది ఇదే గ్రామంలో 1 కోటి రూపాలయ సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా స్మశానవాటికను అభివృద్ధి చేశారని, ఈ ఏడాది మరో కోటి రూపాయలతో మరో స్మశానాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులు గ్రామానికి 5 మంది ఉంటే అభివృద్ధి జరిగి తీరుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ఆర్ ఫండ్ అందజేసిన బీజీఆర్ మైనింగ్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. గత ప్రభుత్వ హయాంలో బిసి కాలనీలో ఇచ్చిన ఇళ్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని గునపాటి రమేష్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో గ్రామాలకు వెళ్లినప్పుడు తాగునీరు, స్మశానంలో వసతులు వంటి సమస్యలు అనేకం వచ్చాయన్నారు. వాటిని ఎంపీ ల్యాడ్స్, సీఎస్‌ఆర్ ఫండ్ వంటి నిధుల ద్వారా క్రమంగా పరిష్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు పి4 కార్యక్రమం కింద గ్రామాలకు, ప్రజలను దత్తత తీసుకోవాలని సూచించారని, అందులో భాగంగా రమేష్ రెడ్డి ఈ కార్యక్రమం చేపటడ్డం సంతోషమన్నారు. పి4 ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, అనర్హులకు ఇళ్లు కేటాయించి అర్హులకు అన్యాయం చేసిందన్నారు. బిసి కాలనీలో ఉన్న జగనన్న లేఅవుట్‌లో అనేక ఇళ్లు అమ్మకాలు చేశారని చెప్పారు. తప్పకుండా దీనిపై అధికారులతో మాట్లాడి అర్హులకు న్యాయం చేస్తామన్నారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వచ్చేవారు తమ గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గునపాటి రమేష్ రెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, నాయకులు బెజవాడ వంశీరెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, గుడి హరిరెడ్డి, మాదాల రమేష్ నాయుడు, రామచంద్రయ్య, నాగార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు.
