అభివృద్ధిలో ఆదర్శవంతం గా శివశంకర్ సేవలు
ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): పరిపాలనలో సరికొత్త వరవడికి శ్రీకారం చుడున్న ఐఏఎస్ ఆఫీసర్ శివ శంకర్ అభివృద్ధిలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. పనిచేసిన ప్రతిచోట ప్రజా అభివృద్ధికి బీజం వేస్తూ సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ప్రజా హారతులు పొందుతున్నారు. తద్వారా ఐఏఎస్ అధికారి ప్రజల కోసం తన సర్వీసును ఎలా ఉపయోగించాలో మాటల ద్వారా కాకుండా చేతలలో చూపుతూ తన ఉద్యోగ ధర్మాన్ని సాకారం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ప్రభుత్వం శివశంకర్ లోతేటి ను ‘తిరుపతి‘ సిఎండి ఏపీఎస్పీడీఎల్సి గా నియమించింది. శివశంకర్ గతంలో పని చేసిన ప్రతీ చోట ‘పాడేరు సబ్ కలెక్టర్ నుండి కడప కలెక్టర్ వరకూ ‘ ప్రజల ఐఏఎస్ అధికారి ‘ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా అధికారులు ప్రభుత్వం చెప్పిన పనులు, లక్ష్యాలకే పరిమితం అవుతారు. వాటితో పాటు, ప్రత్యేకమైన చొరవ తీసుకుని అటు ప్రజలకు,ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడేలా పని చేసిన ప్రతీ చోటా అనేక ప్రజా హిత కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే లో ప్రజలను వివిఐపీలుగా చూస్తారు. సమస్య చెప్పుకోవడానికి వచ్చే ప్రతీ ఒక్కరితో అత్యంత సన్నిహితంగా వారి సొంత మనిషిలా సమస్యను వింటూ వాటి పరిష్కారానికి ఏ స్థాయికైనా వెళ్తారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ‘పీపుల్స్ ఐఏఎస్ ఆఫీసర్’ గా పేరు సంపాదించుకున్నారు. శివశంకర్ 2013 బ్యాచ్ కు చెందిన అధికారి. విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామవాసి. తండ్రి సన్యాసప్పడు విశాఖపట్నంలోని ఐపిడిఏ పాడేరు లో ఆరోగ్య శాఖ లో ఎమ్పీహెచ్ఏగా పని చేసేవారు. పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూలు, ధర్మవరంలో చదువుకున్నారు. ఇంజనీరింగ్ నెట్ సూరత్ కల్ లో పూర్తి చేసి ఏ సి పి ఓ గా పని చేస్తూ ఐఏఎస్ సాధించారు. సబ్ కలెక్టర్ & పీఓ ఐపిడిఏ పాడేరు గా 2016-17 లో పని చేశారు. ప్రతి శుక్రవారం జరిగే గ్రీవెన్స్ డే లో నూతన ఒరవడి తీసుకొచ్చారు. స్వయం ఉపాధికోసం వచ్చే యువతకు స్పాట్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సంతృప్తి చెందితే అక్కడికక్కడే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ శాంక్షన్ చేసేవారు. విశాఖ జిల్లాలో నే ఉన్నా ఐపిడిఏ లోని చాలా మంది గిరిజన విద్యార్థులకు పట్టణ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఈ సమస్యను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతీ పదవ తరగతి విద్యార్థినీ అంటే సుమారు నాలుగు వేల మందికి విశాఖ దర్శన్ ఏర్పాటు చేశారు. అది గిరిజన విద్యార్థులకు వారి జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతి. అంతే కాదు నెలలో రెండు రోజులు ప్రత్యేకంగా ఎంపిక చేసిన విద్యార్థులతో బంగ్లాలోనే పీఓతో డిన్నర్. బహుశా గిరిజన విద్యార్థులను ఇంత దగ్గరగా తీసుకొని ప్రోత్సహించిన అధికారి మరెవరూ లేరేమో. శుక్రవారం ఓ యువకుడు వచ్చి మా ఊరులో మంచి జలపాతం ఉంది, టూరిజం అభివృద్ధి కి అవకాశం ఉంది ఓ సారి చూసి వెళ్లండి అని అడిగందే తడవు వెళ్లి చూసి ‘ కొల్లాపుట్టు జల తరంగిణి ‘ అనే పేరుతో అభివృద్ధి చేసి రిసార్టులు ఏర్పాటయ్యేలా చేసి స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పించారు.ఇంకా బొర్రా గుహల సంక్షిప్త చరిత్రను తెలుగులో స్వయంగా రాసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అరకు గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ ఆధునీకరించారు. కటిక జలపాత అభివృద్ధి నిర్వహణ స్థానిక గిరిజన యువత చేతిలో పెట్టారు.ఐటీడీఏ సందర్శకుల కోసం ఎస్ ఆర్ శంకరన్ సంక్షేమ కాంటీన్ ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వం తొలిసారిగా మోదకొండమ్మ జాతర ను రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఈ సమయంలోనే.చాపరాయి జలపాతం కాదని, దానిని మార్చి చాపరాయి జలవిహారి నామకరణం చేసి అభివృద్ధి చేసారు. డముకు వ్యూ పాయింట్ కట్టారు. ఈ సజీవ సాక్ష్యాలన్నీ ఇప్పుడూ గమనించవచ్చు. 14 మే 1772 , కలెక్టర్ వ్యవస్థ ఆవిర్భావ దినోత్సవమని గుర్తించి దాన్ని పాడేరులో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో పరిపాలనా వ్యవస్థల ఆవిర్భావం, కలెక్టర్ వ్యవస్థ చరిత్రను, పూర్వ సబ్ కలెక్టర్ల సేవలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించడం నభూతో న భవిష్యతి. 2017-19 లో సీతంపేట ఐటీడీఏ లో పని చేసి అక్కడ చెరగని ముద్ర వేసారు. అక్కడి గిరిజనులకు ఆయన ఓ ఆశాజ్యోతి. వారి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా వారికి అనేక స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు. గిరిజన యువత కాంట్రాక్టర్లుగా ఎదిగేలా చేసారు. గిరిజన విద్యార్థుల సమగ్ర వికాసానికి ‘ నెల నెలా వెన్నెల ‘ అనే పేరుతో స్వయంగా ఓ ‘ కార్యాచరణ కేలండర్ ‘ రూపొందించారు. పిల్లలకు రిస్ట్ వాచీలు, అట్లాస్, డిక్షనరీలు ఇవ్వటం, మాథ్స్,సైన్స్ ఒలింపియాడ్లు నిర్వహించడం, మెరిట్ విద్యార్థులతో సూపర్ సిక్స్టీ బ్యాచ్ లు ఏర్పాటు చేసి మరింత ప్రోత్సాహం అందించారు.డ్రాపౌట్స్ తగ్గించడం కోసం వేసవి, దసరా సెలవుల తర్వాత మొదటి రెండు రోజుల్లోనే పాఠశాలకు వచ్చే పిల్లలకు 500 రూపాయల విలువ చేసే స్పోర్ట్ షూస్ , పిల్లలకు విశాఖ , ఏపీ దర్శన్, స్కూల్, కాలేజీ టాపర్స్ కు పీఓతో బంగ్లాలో డిన్నర్ , ఇంకా ఢిల్లీ టూర్.. అందులోసూ 9.5 గ్రేడ్ దాటితే ఫ్లయిట్ లో ఇలా గిరిజన విద్యార్థులు ఓ స్వర్ణ యుగం చూసారు. వీటి ప్రభావంతో చాలా మంది ఐఐటీ, ఎన్ఐటీ లో సీట్లు సాధించారు.ప్రతీ విద్యార్థి సమగ్రంగా ఎదిగేలా చేసింది ఈ ప్రోగ్రామ్. ఇంకా గురుకుల, ఆశ్రమ పాఠశాల పిల్లలకు గుడ్లు తప్ప నాన్ వెజ్ ఉండేది కాదు. ఇది గమనించి మెనూలో వారానికి రెండు సార్లు చికెన్ ఉండేలా మార్పు చేశారు. స్థానికంగా గిరిజన యువతతో పౌల్ట్రీలు పెట్టించి హబ్ స్పోక్ మోడల్ లో స్కూల్స్ లో చికెన్ అందేలా చేశారు. ఓ సంవత్సరం తర్వాత, ఇక్కడ మెనూ గురించి తెలుసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెనూలో చికెన్ ను చేర్చింది. అలాగే అక్కడి హాస్పిటల్స్ రూపురేఖలు మార్చి రాష్ట్రంలోనే అత్యుత్తమ గిరిజన హాస్పిటల్స్ గా తీర్చిదిద్దారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సీతంపేట అయితే ఓ ప్రత్యేకం. గిరిజన ప్రాంతంలోనే తొలి ఎయిర్ కండిషన్డ్ హాస్పిటల్ గా కార్పోరేట్ తరహాలో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా సీతంపేటను ఏపీ టూరిజం మాప్ లో పెట్టిన ఘనత శివశంకర్ దే. ఒక సాధారణ చెరువు ప్రాంతాన్ని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ గా మార్చి ఆ గ్రామ స్వరూపాన్ని మార్చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే ‘పారామోటారింగ్, 5డి థియేటర్ వంటివి ‘ ఈ పార్క్ లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.గిరిజన యువతకు పారామోటార్ పైలట్లు గా శిక్షణ ఇచ్చి గ్రామీణ యువత ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. ఈ పార్క్ ఇప్పటికీ రన్ అవుతూ ఏటా కోటిన్నరకు పైగా ఆదాయం ఆర్జిస్తూ 60 మందికి పైగా గిరిజన యువతకు శాశ్వత ఉపాధి కల్పిస్తోంది. మెట్టుగూడ , సున్నపుగెడ్డ జలపాతాలు, ఆడలి హిల్ వ్యూ పాయింట్లు, జగతిపల్లి రిసార్ట్స్ , గిరిజన మ్యూజియం, టీటీడీ గుడి వంటి ఎన్నింటికో శ్రీకారం చుట్టారు. ‘ సాహసం చేయరా డింభకా ‘ అనే పేరుతో చేసిన పారామోటార్ అడ్వెంచర్ ఫెస్ట్ నిర్వహించారు. ఒక చిన్న గిరిజన గ్రామమైన సీతంపేటలో సీతాకోకచిలుకల్లా పారామోటార్స్ గాలిలో ఎగరటం వర్ణనాతీతం. ఇక ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు, పైనాపిల్ మార్కెటింగ్, గిరిజన గ్రామాల్లో లైబ్రరీలు, శిఖరాగ్ర గ్రామాలకు రహదారులు.. చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద పుస్తకమే అవుతుంది. సీతంపేట లో ఓఇరవై వేల బ్యాంకు ఖాతాలు ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ సరైన సదుపాయాలు లేక ఒక చిన్న ఇరుకు గదిలో నిర్వహించేవారు. గిరిజనులకు చాలా అసౌకర్యంగా ఉండేది. ఎస్బిఐ కి సొంతంగా బిల్డింగ్ కట్టే అవకాశం లేదు. ఐటీడీఏ లో దీనికి అనుమతి లేదు. కానీ ఎలాగైనా సమస్యను పరిష్కరించాలి.అంతే.. ఓ ఐడియా. జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా బ్యాంకు దగ్గర నుంచి 80 లక్షలు లోన్ తీసుకొని వాటితోనే వారికి ఒక అధునాతన బ్రాంచ్ కట్టించి వారికే అద్దెకిచ్చి ఆ అద్దెను నెలనెలా ఈఎంఐ గా అడ్జస్ట్ చేసి గిరిజనులకు మంచి బ్యాంకింగ్ సేవలు అందేలా చేసారు. బహుశా క్షేత్రస్థాయి లో ఇలాంటి ప్రయత్నాలు చేసే అధికారులు అరుదేమో. ఇక ఆయన ఆధ్వర్యంలో జరిగిన కళింగాంధ్ర ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘కాలగమనంలో శ్రీకాకుళం ‘ అనే పేరుతో పూర్వ రాతి యుగం నుండి 2019 ఫిబ్రవరి వరకూ ఆ జిల్లా ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో మినియేచర్ మోడల్స్ తో శివశంకర్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. 2020-22 లో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గా 116 సచివాలయాలు ఐ ఎస్ ఓ 9001 సర్టిఫైడ్ కార్యాలయాలుగా తీర్చిదిద్దారు. సచివాలయ ఉద్యోగులలో ఐక్యత తీసుకురావడానికి ప్రతి సోమవారం యూనిఫాం కంపల్సరీ చేశారు. తర్వాత ప్రభుత్వానికి ఈ ఆలోచన నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. ‘క్లీన్ ఆంధ్ర’ కోసం’ కాఫీ విత్ క్లాప్ మిత్ర ‘ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి , అందులో భాగంగా గ్రామ పారిశుద్ధ్య కార్మికులతో ప్రతీ గురువారం కూర్చొని ఓ ఇష్టాగోష్టి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని ,పరిష్కరించి వారి శ్రమకు గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) కలిగించి, సంబంధిత ఉద్యోగులందరిలోనూ ఆ ఆలోచనను మొలకెత్తించారు. 2022-24 లో ‘పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్’ గా పనిచేసిన శివశంకర్ ‘ప్రజా దేవో భవ’ అన్నట్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేసారు. గ్రీవెన్స్ డే అంటే ప్రజలు తమ సమస్యలు తీరిపోయే రోజుగా భావించేవారు. సమస్యల పరిష్కారానికి వివిధ కౌన్సిలింగ్ టీం లను ఏర్పాటు చేశారు. తీవ్ర , సుధీర్ఘ అపరిష్కృత రెవెన్యూ, మహిళా, ఉపాధి కల్పన సమస్యల కోసం ఒక డెప్యూటీ కలెక్టర్, లీగల్ కౌన్సిలర్, సైకియాట్రిస్ట్, పోలీస్, ఐసిడిఎస్ సిబ్బంది తో కౌన్సిలింగ్ టీంలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రీవెన్స్ డే కు సుదూర ప్రాంతాల నుండి వస్తారనే ఉద్దేశ్యంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అది కూడా ప్రభుత్వ ఖర్చుతో కాకుండా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఏ రోజు కా రోజు దాతను గ్రీవెన్స్ డే లో అందరి ముందు చప్పట్లతో సత్కరించారు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని సునిశిత దృష్టితో చూసి ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపి వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక్కడ ప్రజలు కలెక్టర్ను ఓ అన్నగా, తమ్ముడిగా ఇంట్లో మనిషి లా భావిస్తారు. ఎవ్వరైనా ఏ సమయంలోనైనా ఆయన చాంబర్ లోకి వెళ్ళవచ్చు. రికమెండేషన్ అవసరమే లేదు. ఎవ్వరికైనా విఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు. రెవిన్యూ సమస్యలకైతే స్వయంగా కలెక్టరే జడ్జిలా వ్యవహరించి ఇరు పక్షాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేసేవారు. ఇక ఆయన చేసిన కార్యక్రమాల జాబితా చూస్తే ఒక కలెక్టర్ ప్రభుత్వం అప్పజెప్పిన పనులే కాకుండా ఇన్ని ఇనీషియేటివ్స్ చేయగలరా అని అనిపించక మానదు. కొత్త జిల్లా, అస్సలు సదుపాయాలు లేవు.కలెక్టరేట్ బిల్డింగ్ చాలా చిన్నది.రోడ్డు లేదు. ఇప్పుడు కలెక్టరేట్ చూస్తే ఔరా అనిపించక మానదు. కలెక్టరేట్ ప్రాంగణంలో దుర్గి శిల్పి కళతో తెలుగు తల్లి విగ్రహం, ఆంధ్రప్రదేశ్ చిహ్నాల( కృష్ణజింక, రామచిలుక, కొర్రమీను, వేప, మామిడి, మల్లె,తెలుగు తల్లి పాట)తో పల్నాడు జిల్లా ఆవిర్భావ చరిత్ర , శ్రీకృష్ణదేవరాయల తెలుగు శాసనం తో సకల సౌకర్యాలు దర్శనమిస్తాయి. ఇదంతా శివశంకర్ సృష్టే. కలెక్టరేట్ లోపల పరిపాలనకు కావలసిన అన్ని హంగులూ సమకూర్చి వాటికి అంబేద్కర్, జాషువా, ఎస్ ఆర్ శంకరన్ పేర్లు పెట్టారు. కలెక్టర్ ప్రతి రోజు షెడ్యూల్ , ఆ రోజు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో ప్రజలకు రియల్ టైమ్లో తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులను కలెక్టరేట్లలో ఏర్పాటు చేశారు. ఇలా ప్రజల కలెక్టరేట్ గా వారి సమస్యలు తీర్చే వేదికగా ఐ ఎస్ ఓ 9001 సర్టిఫైడ్ కార్యాలయంగా తీర్చిదిద్దారు. గ్రామోదయం శివశంకర్ ట్రేడ్ మార్క్. ప్రతి గురువారం జిల్లా ప్రత్యేక అధికారులు ఒక గ్రామంలో ఉదయం 7 నుండి 10 మధ్య మండల అధికారులతో వీధుల్లో నడిచి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి. గర్భిణులు, బాలింతలు, పిల్లలతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుని వారికి అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో స్థానిక సమస్యలకు పరిష్కారం చూపారు. ఇంకా విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థుల కోసం ‘ ఎ డే విత్ కలెక్టర్ ‘ కార్యక్రమం. నెలలో ప్రతి రెండో శుక్రవారం ఓ పూటంతా 500 మంది విద్యార్థులతో ముఖాముఖి. గోల్ సెట్టింగ్, కెరీర్ కౌన్సెలింగ్, హాబీలు, గుడ్ హేబిట్స్ వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కౌమార దశ ‘ 9 నుండి 14 సంవత్సరాల ‘ వయసు లో ఉన్న ఆడపిల్లలకు రక్తహీనత సమస్య ఎక్కువ ఉందని గమనించి దాని నియంత్రణ లో తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని హిమోగ్లోబిన్ ప్రోగ్రెస్ కార్డ్లను ప్రవేశపెట్టారు. ప్రతి మూడు నెలలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి వాటిని ఏ బి సి డి గ్రేడ్లు గా విభజించి ప్రోగ్రెస్ కార్డ్ లో రాసి విద్యార్థినులకు ఇచ్చి వారి తల్లిదండ్రుల సంతకంతో తిరిగి తీసుకునేవారు. ఇలా చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యం గురించి వారి తల్లిదండ్రులలో విస్తృతమైన అవగాహన కలిగేలా చేసారు. తెలుగు భాషా , సాహిత్య వికాసానికి ప్రతీ నెలా మూడో శనివారం ‘ నెల నెలా … సాహిత్య మేళ! ‘ అనే పేరుతో ఓ సమాలోచన కార్యక్రమం చేసి తెలుగు భాష కు సాహిత్యానికి సేవలందించిన మహనీయులకు ఇష్టాగోష్టితో నివాళులర్పించారు.
‘ పల్నాడు వర్మి- పొలానికి బలిమి ‘: అనే బ్రాండ్ తో ప్రతి పంచాయతీ లోనూ ఎస్ డబ్ల్యూ పిసి లను బలోపేతం చేసి వర్మి కంపోస్ట్ ను రైతులకు, వినియోగదారులకు దగ్గర చేసారు.నెలలో మొదటి సోమవారం జిల్లాలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చేనేత వస్త్రాలు ధరించేలా నిబంధన పెట్టి అమలు చేసారు. ఎస్సీ ఎస్టీ, ల కోసం నవోదయం అనే పేరుతో ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ , ఎంపవర్మెంట్ లను లక్ష్యంగా స్కూల్ టాపర్లను దళిత సంఘాలు దత్తత తీసుకొని మంచి కాలేజీల్లో అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించడం, ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించడం, బ్యాంకర్లను బుజ్జగించో, భయపెట్టో లోన్లు ఇప్పించడం, ఎస్సీ ఎస్టీ సర్పంచ్ లను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా చేసారు. ప్రతి సోమవారం కనీసం నాలుగు కొత్త కార్లు ఇనాగరేట్ చేసేవారు. బ్యాంకర్లతో కొట్లాడి ఒకరికి జెసిబి ఇప్పించినపుడు లబ్దిదారుడు కలెక్టరేట్ ప్రాంగణంలో పెద్ద పండుగలా జరుపుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జరిగిన 1000 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ, జాతీయోద్యమ సంఘటనలతో ఏర్పాటు చేసిన మెగా ఎగ్జిబిషన్ పల్నాటి ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. కొత్త జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అధునాతన కలెక్టర్ బంగ్లాను , జాయింట్ కలెక్టర్ రెసిడెన్స్ను నిర్మించిన ఘనత ఆయనదే.కలెక్టరేట్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి కలెక్టరేట్ నిర్వహణకు స్థిర ఆదాయం వచ్చేలా చేశారు. పల్నాడు జిల్లాలో ఎక్కడ తిరిగినా మండల, జిల్లా, రాష్ట్ర సరిహద్దుల సైన్ బోర్డ్లు కనపడతాయి.320కి పైగా బోర్డ్లు పెట్టి జిల్లాలో తిరిగే ప్రతి ఒక్కరికీ సరిహద్దులు తెలిసేలా చేసారు. కొండవీడు కోట పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేశారు. నైట్ క్యాంపులను ప్రారంభించారు. హెలీరైడ్ తో అంగరంగ వైభవంగా కోట పైన తొలి ఫెస్టివల్ నిర్వహించి కొండవీడు శోభను ద్విగుణీకృతం చేసారు.ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో అటు ప్రజా ప్రతినిధులు ఇటు సామాన్య ప్రజల్లోనూ ‘పీపుల్స్ కలెక్టర్’ గా స్థానం సంపాదించుకున్నారు. 2024 లో కడప కలెక్టర్ గా చేసింది మూడు నెలలైనా అక్కడా చెరగని ముద్ర వేసారు. రెవిన్యూ సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఇంకా క్రీస్తు శకం 575 నాటి తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలంలోని కలమళ్ళ గ్రామంలో నిరాదరణగా ఉంటే దానిని గుర్తించి ఆగస్టు 29 న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా శాసనానికి గౌరవ ప్రతిష్ట చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 550 మంది విద్యార్థులను ఎంపిక చేసి కడప నుంచి అరకు దాకా దసరా సెలవులలో ఏపీ దర్శన్ చేయించారు.గండికోట అభివృద్ధిలో స్థానిక భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో గండికోట టూరిజం డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామోదయం ద్వారా గ్రామీణ ప్రాంతాల పర్యటన ముమ్మరం చేశారు. సీపీ బ్రౌన్ లైబ్రరీ ఆధునీకరణ పనులు వేగవంతం చేశారు. కడప కలెక్టర్ గా ఉన్న సమయంలో తెలంగాణ కేడర్ కు బదిలీ అయి , హైదరాబాద్ మహానగరం ఉన్నా, ఎలాగైనా తన సొంత రాష్ట్రంలో సేవలు అందించాలనే సంకల్పంతో క్యాట్,హైకోర్టు, సుప్రీంకోర్టులో డీవోపీటీపై గెలిచి ఇటీవల తిరిగి ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చారు.తాజాగా శివశంకర్ ను తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్’ సి ఎం డి గా ప్రభుత్వం నియమించింది.