ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):తిరుమల పరకామణి చోరీ కేసులో సి.ఐ.డి ముమ్మరమైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో తాజాగా విచారణ చేపట్టారు.అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు ముఖ్యంగా కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా తీస్తున్నారు.నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా, లేదా అనే ప్రశ్నకు ప్రధానంగా ఖచ్చితమైన సమాధానాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు విశ్వాసనీయంగా తెలుస్తోంది.తిరుమల పరకామణిలో జరిగిన సంచలన చోరీ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేరుగా రంగంలోకి దిగి విచారణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఆయన నేతృత్వం లోని అధికారుల బృందం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో పలువురు అధికారులను విచారించింది. అప్పటి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావుతో పాటు తిరుమల కమాండ్ కంట్రోల్ యూనిట్ ఇన్‌చార్జి చంద్ర, ఆర్‌ఎస్ఐ సుబ్బరాజు, టీటీడీ గార్డు రామచంద్ర ను వేర్వేరుగా ప్రశ్నించివాంగ్మూలాలు నమోదు చేసుకుంది. విచారణ లో భాగంగా డిప్యూటీ ఈవో మల్లికార్జునరావును సీఐడీ డీజీ పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు స‌మాచారం. నిందితుడు రవికుమార్ వద్ద 72 డాలర్లు పట్టుకుంటే, ఎఫ్‌ఐఆర్‌లో కేవలం 9 డాలర్లు మాత్రమే ఎందుకు చూపించారు? మిగిలిన కరెన్సీ ఏమైంది? ఈ కేసుకు సంబందించిన పంచనామా ఎందుకు నిర్వహించ లేదు?” అని డీజీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. “ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చిన పెద్దలు ఎవరు? నాటి అధికార పార్టీ నేతల నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా? డిప్యూటీ ఈవో హోదాలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు స‌మాచారం. టీటీడీకి డిప్యుటేషన్‌పై ఎలా వచ్చారు? ఇందులో మాజీ ఈవో ధర్మారెడ్డి పాత్ర ఏమైనా ఉందా? అని కూడా సీఐడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం తిరుమల కమాండ్ కంట్రోల్ యూనిట్ ఇన్‌చార్జి చంద్రను ఫుటేజీల గురించి నేరుగా ప్రశ్నించారు. “చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయా? వాటిని డిలీట్ చేశారా? ఒకవేళ ఉంటే ఎవరికి అప్పగించారు?” అని డీజీ ప్రశ్నించగా, తాను ఫుటేజీలో చోరీని గమనించి వెంటనే వీజీవోకు సమాచారం ఇచ్చానని చంద్ర బదులు ఇచ్చినట్లు తెలిసింది. ఆర్‌ఎస్ఐ సుబ్బరాజు, గార్డు రామచంద్రను కూడా అధికారులు వేర్వేరుగా విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా కీలక అధికారిగా భావిస్తున్న టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కూడా సీఐడీ డీజీ ఎదుట హాజరు కానున్నారు. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.