‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026’ను ఘనంగా నిర్వహిస్తున్నాం:సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం:జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు

ప్రభాతదర్శిని,(సూళ్లూరుపేట-ప్రతినిధి):జనవరి 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో పక్షుల పండగను వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026′ నిర్వహణపై పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు తీరాన ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.పులికాట్ సరస్సు ప్రాంతంలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించామని, గత సంవత్సరం ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను పునరుద్ధరించి స్టేట్ ఫెస్టివల్‌గా, మెగా ఫెస్టివల్‌గా ప్రకటించిందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది మొదటగా జనవరి 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామని అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందర్శకుల స్పందన, అలాగే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే సూచనలు, స్థానిక రాజకీయ కమిటీ సలహాల మేరకు ఈ ఫెస్టివల్‌ను జనవరి 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఫెస్టివల్‌కు సంబంధించిన ఈవెంట్లు, కార్యక్రమాల వివరాలను ఇప్పటికే ఎమ్మెల్యే తో కలిసి మీడియా మిత్రులకు వివరంగా తెలియజేశామని తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 12వ తేదీ సాయంత్రం సుమారు 3:30 నుండి 4:00 గంటల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూళ్లూరుపేటకు విచ్చేయనున్నారన్నారు.ముఖ్యమంత్రి నేలపట్టు లేదా అటకాని తిప్ప ప్రాంతాల్లోని ఫ్లెమింగో పాయింట్‌ను సందర్శించి, అనంతరం సూళ్లూరుపేట జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్‌లో నిర్వహించే పబ్లిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారన్నారు.ఈ మూడు రోజుల ఫెస్టివల్‌లో భాగంగా నేలపట్టు బర్డ్ శాంక్చురీ,అటకాని తిప్ప ఫ్లెమింగో పాయింట్స్,సూళ్లూరుపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్‌లో వివిధ ఈవెంట్స్, స్టాల్స్,బీవీ పాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బల మడుగులో వాటర్ ఫాల్స్,శ్రీ సిటీ ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్క్‌షాప్, సింపోజియం,అలాగే అడ్వెంచర్ టూరిజం, ఎకో టూరిజం కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పులికాట్ సరస్సు టూరిజాన్ని దృష్టిలో పెట్టుకుని, ఐలాండ్ టూరిజం, లేక్ టూరిజం కాన్సెప్ట్‌తో పాటు కొరిడి, పెర్నాడు వంటి ద్వీప మార్గాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సూళ్లూరుపేట – నాయుడుపేట ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అదే సమయంలో అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌కు గౌరవ ముఖ్యమంత్రి గారి హాజరు ఎంతో సంతోషకరమని పేర్కొంటూ, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎస్పీ, కన్జర్వేటర్ , ఎమ్మెల్యే తదితర అధికారులతో కలిసి సమన్వయంతో చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్‌ను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా గత సంవత్సరం 2025లో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి సూళ్లూరుపేట నియోజకవర్గానికి రానుండటం గర్వకారణమన్నారు. ఈసారి ఫెస్టివల్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మేరకు నేలపట్టు, అటకాని తిప్ప, బీవీ పాలెంతో పాటు కొత్తగా ఇరుకుం ఐలాండ్, ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కూడా సందర్శన కేంద్రాలుగా చేర్చామని తెలిపారు. దీంతో తిరుపతి జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం కలుగుతుందన్నారు.సైబీరియా నుంచి వచ్చే ఫ్లెమింగోలు నేలపట్టు ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు నెలల పాటు నివసించడం ఒక అరుదైన ప్రకృతి అద్భుతమని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ పిల్లలకు పక్షులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేలపట్టు, అటకాని తిప్ప ప్రాంతాల్లో పక్షుల ప్రదర్శన ఏర్పాటు చేసి, పక్షుల చిత్రాలు, పేర్లు, వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ,ఫ్లెమింగో ఫెస్టివల్- 2026’ కు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఫ్లెమింగో ఫెస్టివల్‌ను సందర్శించే సందర్శకులందరూ భద్రతా నియమాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. ఫ్లెమింగో పక్షులు ఇంకా సుమారు నాలుగు నెలల పాటు ఈ ప్రాంతంలో ఉండనున్నాయని, కాబట్టి ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా వచ్చి వీక్షించవచ్చని తెలిపారు. వీఐపీలు సందర్శించిన సందర్భాల్లో కూడా సాధారణ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ చారి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరు పేట మునిసిపల్ ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డి, టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్, టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, సూళ్లూరు పేట మునిసిపల్ కమీషనర్ చెన్నయ్య, డి ఎస్ డి ఓ శశిధర్, సెట్వీన్ సి ఈ ఓ యస్వంత్, డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ సి రాజా నాయక్, రెవిన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు ,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.