ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు నగరంలో దోమల బెడద ఎక్కువ ఉందని వాటిని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన టిడిపి ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలో పారిశుధ్య, డ్రైనేజీ తదితర అంశాలపై కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని తెలిపారు. అలాగే మురికి కాలువల్లో నీరు నిలిచిపోయి దోమల బెడద ఎక్కువగా ఉందని అన్నారు. తద్వారా దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని దోమల నివారణకు చర్యలు చేపట్టాలని వేమిరెడ్డి కమిషనర్ ను కోరారు. అలాగే రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆయా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కమిషనర్ ను కలిసిన వారిలో కార్పొరేటర్లు కర్తం ప్రతాపరెడ్డి, శ్రీధర్, లెక్కల వెంకా రెడ్డి, యూత్ లీడర్ ముస్తాక్, కృష్ణ యాదవ్, అజయ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.