
పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి
గజపతినగరం సర్కిల్ వార్షిక తనిఖీలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గజపతి నగరం సర్కిల్ కార్యాలయ సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా గజపతినగరం సర్కిల్ ఆఫీసును సందర్శించామన్నారు. సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులను, సర్కిల్ కార్యాలయంలోని పలు రికార్డులను, సిడి ఫైల్స్ ను డిఐజి తనిఖీ చేసామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో 3వేలు స్కూల్స్, కాలేజ్లోను, గ్రామాల్లోను 12వేల మాదక ద్రవ్యాలు, సైబరు క్రైం, మహిళల భద్రత, రహదారి భద్రతపట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువతను సాధారణ స్థితికి తీసుకొని వచ్చేందుకు డీ-అడిక్షన్ సెంటర్స్ లో చేర్పించి, స్వస్థత చేకూర్చామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, సాగు, రవాణ సమాచారాన్ని 1972కు అందించాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా డ్రోన్స్ ను కూడా వినియోగిస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణదారులు అవలంభిస్తున్న విధానాలకు అనుగుణంగా రైళ్ళు, బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నామన్నారు. రహదారి ప్రమాదాలు జరగకుండా చూడాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులను, స్టాపర్లు, లైటింగును ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు జరగాలని, ఎప్పటి కప్పుడు చెక్ పోస్టుల పని తీరును అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని, గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను గుర్తించి, జప్తు చేస్తున్నామన్నారు. గంజాయి వ్యాపారాలకు తరుచూ పాల్పడుతున్న వ్యక్తులపై పిట్ ఎన్.డి.పి.ఎస్. యాక్టును కూడా ప్రయోగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గంజాయి నియంత్రణకు బహుముఖ ప్రణాళికలను అవలంభించి, గంజాయిని రేంజ్ పరిధిలో నిర్మూలిస్తామని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, బొబ్బిలి డిఎస్సీ జి. భవ్య రెడ్డి, గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ స్వాగతం పలికి, పుష్ప గుచ్చంను అందజేసారు. అనంతరం, డిఐజి, ఎస్పీ బొబ్బిలి డీఎస్పీ సర్కిల్ ఆఫీసు పరిసరాలను పరిశీలించి, మొక్కలను నాటారు. ఈ వార్షిక తనిఖీల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, బొబ్బిలి డిఎస్సీ జి.భవ్యారెడ్డి, గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ, ఎస్బీ సీఐ ఏవి లీలారావు, గజపతినగరం సర్కిల్ ఎస్ఐలు కే.కే.కే. నాయుడు, మహేష్, జయంతి, సీతారాం పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
