ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, ఎఫ్.సి.ఐ గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థ కు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు పెరిగిపోయి, వర్షపు నీటి మురుగు నిల్వతో దోమల ఎదుగుదలకు కారణభూతమవుతున్న స్థలాల యజమానులను గుర్తించి శుభ్ర పరుచుకునేలా నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలు అసాంఘిక శక్తులకు, పందులకు ఆవాసంగా మారుతున్నాయని, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారని కమిషనర్ తెలిపారు. అనంతరం స్థానిక అల్లీపురం డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. యార్డు నిర్వహణ, రీ సైక్లింగ్ విధానాలు వంటి అన్ని అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక వెంకటేశ్వర పురంలోని పశువుల సంత ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పారిశుధ్య నిర్వహణ పనులను క్రమంతప్పకుండా చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ ఈ.ఈ సంజయ్, డి.ఈ సురేష్, సిటీ ప్లానర్ దేవీ కుమారీ, సర్వేయర్ సోమేశ్వర్ రావు, ఉద్యాన శాఖ ఏ.డి ప్రదీప్ కుమార్, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.