ఏపీ సిఎం చంద్రబాబు ను కోరిన మందా…కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపిన నారా
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఏపీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి చంద్రబాబు నాయుడు ని కలిసి కోరారు. శనివారం హైదరాబాద్ లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును మంద కృష్ణ మాదిగ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమం విజయాన్ని ముద్దాడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి పురుడుపోసి ఆయుధంగా మలిచిన చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి పుష్ప గుచ్చo అందించి మంద కృష్ణ మాదిగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సిఎం చంద్రబాబు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టమే సుప్రీం కోర్టు న్యాయ విచారణలో విజయం సాధించిందని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మొదటి అమలు చేసింది చంద్రబాబు నాయుడే.అలాగే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన తరువాత అమలు జరగాల్సిన సమయంలో ఏపీ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం శుభ పరిణామమని అన్నారు. త్వరగా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రావాలని కోరారు.ఇందుకు స్పందించిన చంద్రబాబు నాయుడు ముప్ఫై ఏళ్ళు మడమ తిప్పకుండా గట్టిగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైందని, మడమ తిప్పని పోరాటంతో విజయం సాధించావని మంద కృష్ణ మాదిగని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ కి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.