
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలో ఎండ తీవ్రత, వడగాలులకు ప్రజలు గురికాకుండా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి అని సంబంధిత అధికారులను డి ఆర్ ఓ నరసింహులు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు హీట్ వేవ్స్ కు సంబంధించి చేపట్టవలసిన మందస్తు జాగ్రత్తలపై తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజలు ఎండ తీవ్రత, వడ గాలులకు గురికాకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి అని తెలిపారు. ఎండలు పెరుగుతున్నందు వలన ప్రతి ఒక్కరు వడదెబ్బ తగలకుండా తగినన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇంటిపట్టునే ఉండాలని అవసర నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు గొడుగు, టోపీ, తలపాగా రక్షణగా ధరించాలని అన్నారు. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మరియు కళ్లు రక్షణ కోసం సన్ గ్లాసెస్ లు ఉపయోగించాలని తెలిపారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ద్రవపదార్థాలు పండ్ల రసాలు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎఎస్ వంటివి అధికంగా తీసుకోవాలని అన్నారు. నీరసం కళ్ళు తిరగడం, తల తిరుగుట వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న ఎడల అటువంటివారిని చల్లటి ప్రదేశాల్లో ఉంచి తడిబట్టతో శరీరాన్ని బాగా తుడిచి ప్రథమ చికిత్స చేయాలని తెలిపారు. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాని వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని తెలిపారు. ముఖ్యంగా బాలింతలు, చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పశువులకు పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని తెలిపారు. నీటి కొరత లేకుండా ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించాలని అవసరమైతే ప్రత్యేకంగా ట్యాంకర్లు నింపి ప్రజల దాహాన్ని తీర్చాలని తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని నీటితో నింపి ఉంచుకోవాలన్నారు. వాటర్ పైప్ లైన్ లు లీకేజీ లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకొని నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. అవసరమైన అన్ని ప్రదేశాలలో చలివేంద్రాలు, మజ్జిగ ఏర్పాటు చేయడం పంచాయతీరాజ్ శాఖ వారు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి, జెడ్పీ డిప్యూటీ సి ఈ ఓ జుబేదా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంత భాయి పాల్గొన్నారు.