ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఊల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు లో ఉన్న గ్రామ దేవత ఊల్లమ్మ తల్లి అమ్మవారికి జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడూరుపాడుకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టిడిపి నేత కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. గజమాలలతో ఆహ్వానించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. గతంలో రెండుసార్లు అమ్మవారిని దర్శించుకున్నామని, ఆమె ఆశీస్సులతోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నామన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029 నాటికి ఎమ్మెల్యేగా ఈ స్టేజిపై నిలబడాలనీ ఆకాంక్షించారు. సోదరుడు శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకపోయినా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజలకు అండగా ఉన్నారన్నారు. కమలాకర్ రెడ్డి, రాజేష్ తదితరులు అమ్మవారి కుంభాభిషేకం ఇంత గొప్పగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోషియేషన్ క్రీడాకారులకు అభినందనలు: ఇటీవల బాపట్ల జిల్లా పెదనందిపాడులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విమెన్, ఓవరాల్ కేటగిరీలలో విజయం సాధించిన జిల్లా వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోషియేషన్ క్రీడాకారులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అభినందించారు. ఇటీవల జిల్లా నుంచి 80 మంది అసోషియేషన్ క్రీడాకారులు పోటీలకు వెళ్లగా వారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున స్పోర్ట్స్ వేర్ అందజేశారు. ఈ సందర్బంగా గెలిచిన అనంతరం ఆదివారం నగరంలోని విపిఆర్ నివాసానికి వచ్చిన వారు.. ఎంపీ, ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడాకారులకు తమరి మద్దతు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బసవయ్య, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరమ్మ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
