ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న ఆదర్శవంతమైన విషయాలను బోధించాలన్నారు. చదువంటే పుస్తకాలలో ఉన్న అంశాలను, చెప్పడం, రాయడం కాదని, విద్యార్థులను ఉపాద్యాయులు ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటూ సమయపాలన పాటించడంలోనూ, విద్యాబోధనలో బోధించడంలోనూ తనదైన శైలిని చూపాలన్నారు. ఉపాధ్యాయులు ఏది చెప్తే అది విద్యార్థులు చేస్తారని ఆ ఘనత ఉపాధ్యాయులకి దక్కుతుందన్నారు. ఎంపీడీవో రజినీకాంత్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉపాధ్యాయుడు సుధాకర్ మాట్లాడుతూ నేడు సమాజంలో నెలకొంటున్న అసాంఘిక కార్యక్రమాలకు మద్యపానమే మూల కారణమని ఆయన అన్నారు. రాజ్యాంగంలో మద్యం ద్వారా ప్రభుత్వాలు నడవకూడదని స్పష్టంగా తెలియజేసిన పాలకులు అందుకు తిరోధకలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన శంకరయ్య, నారాయణ, శంకరయ్య లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పద్మావతి, ఎంఈఓలు శైలజ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.