ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వి.పి.ఆర్‌ విద్య పాఠశాల ద్వారా వందలాది మంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం చాలా సంతోషాన్నిస్తుందని వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరం సందర్భంగా వి.పి.ఆర్‌ విద్య పాఠశాలలో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె గురువారం పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకున్న ఆమె.. విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వి.పి.ఆర్‌ విద్య పాఠశాల ద్వారా వందలాదిమంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. పాఠశాల ఆవరణలోకి వస్తేనే తమకు ఉన్న ఒత్తిడి అంతా మర్చిపోతామన్నారు. వి.పి.ఆర్‌ విద్య పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 30 మంది పరీక్షలు రాస్తే 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. వారిలో 27 మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించడం గర్వంగా ఉంటుందన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులపై వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, దేశానికి మంచి సేవలు అందించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా 6వ తరగతికి ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఇంకా మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, షూస్‌, యూనిఫాం, ఇతర విద్యాసామాగ్రితో కూడిన కిట్లను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.