ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ‘డ్రోన్ సిటీ’ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ భారీ ప్రాజెక్టుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ఏడాది డిసెంబరులో భారీ స్థాయిలో ‘డ్రోన్ షో’ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. సోమవారం నాడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు… ఆర్టీజీఎస్, పౌర సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కె. పార్ధసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంపై ప్రత్యేకంగా చర్చించిన సీఎం, వ్యవసాయం, వైద్య రంగాల్లో డ్రోన్ల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ప్రభుత్వ అవసరాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం: ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే తమ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. “ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న సేవలపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నదే మాకు ముఖ్యం” అని అన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రతీ నెలా తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతీ మూడు నెలలకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద అందుబాటులో ఉన్న భారీ డేటాను విశ్లేషించడం ద్వారా సమస్యల మూలాలను గుర్తించి, వేగంగా పరిష్కారాలు చూపవచ్చని తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్ విస్తరించాలి: ప్రస్తుతం వాట్సాప్ ద్వారా 730 రకాల సేవలు అందిస్తున్నామని, ఈ సేవలను ప్రజలు మరింత ఎక్కువగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాంకేతిక కారణాలతో సంక్షేమ పథకాలు అందని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని, భూ వివాదాలకు ముగింపు పలికేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల వ్యవస్థను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరు విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.