ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:డాక్టర్ పివి రమేష్ పిలుపు ఆరోగ్యం సామాజిక బాధ్యత’ తిరుపతి సదస్సులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లు
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): దేశంలో ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా మారాలని, భారత ప్రభుత్వ పూర్వ ఆరోగ్య కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. సుజాతారావు అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వేమన విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక, ఎస్వీ మెడికల్ కళాశాలలు సంయుక్తంగా ‘ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య రంగం – సామాజిక బాధ్యత’ అన్న అంశంపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ సుజాతా రావు, డాక్టర్ పివి రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత రావు తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. 1948లో ఆరోగ్య రంగం గురించిన చర్చ దేశంలో ప్రారంభమైందని తరువాతి కాలంలో పలు కమిటీలు, పలు రికమండేషన్స్ అందించాయని 1983లో దేశంలో మొదటిసారిగా ఆరోగ్య విధానం ప్రకటించారని ఆ తరువాతి క్రమంలో దశలవారీగా వచ్చిన మార్పుల వల్ల ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా లేకుండా పోయిందని, పేదలు, ఖర్చు పెట్టలేని వారు ఆరోగ్యాన్ని పొందలేని దుస్థితికి ఆరోగ్య రంగం దేశంలో నెట్టివేయబడిందని సుజాత రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుజాతారావు పలు గణాంకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడంలేదని, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ, ప్రైవేటు రంగానికి వైద్యాన్ని అప్పజెప్పడం ఆందోళనకరమైన అంశంగా ఆమె పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయం తప్ప ప్రజల బాగోగులు పూర్తిగా మరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో కేరళ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శవంతంగా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిక చేసుకున్నప్పుడు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉందని వైద్య సౌకర్యాలు బాగా మెరుగయ్యాయని ప్రజలకు తేలికైన, చౌకైన, ఉచిత వైద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగం ప్రపంచానికి జర్మనీలోని ఆదర్శంగా ఉంటే, రాష్ట్రం కేరళ భారతదేశానికి ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తన పాత్రను విస్మరిస్తున్నదని, చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వారికి బదలాయించటం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 11 మెడికల్ కాలేజీలు నిర్వహిస్తామని ప్రకటించటం, క్యాపిటేషన్ ఫీజు పేరిట కోట్ల రూపాయలు అర్హతతో నిమిత్తం లేకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకొని సీట్లు కేటాయించాలని భావించటం సమర్థనీయం కాదని ఆమె విమర్శించారు. దేశంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో మరణాల రేటు వెయ్యికి 32 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 27, కేరళలో 10 ఉందని అదే జర్మనీలో నలుగురు మాత్రమే మరణానికి గురవుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి లక్షమందిలో మెటర్నటీ సమస్యలతో 45 మంది మరణిస్తుండగా, దేశంలో 97 మంది కేరళ రాష్ట్రంలో కేవలం 19 మంది మరణాలకు గురవుతున్నారని తెలిపారు. రైతాంగంలో కేవలం ఆరోగ్య ఖర్చులు భరించలేక ప్రతి నలుగురులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం, పెద్ద పెద్ద కార్లు కొనడం, జిడిపి లెక్కలు చూపటం కాదని ఆరోగ్యంతో జీవించడమేనని ఆమె వ్యాఖ్యానించారు. 70 శాతం వ్యాధులకు ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే సాధారణ మందులతో నయం చేయవచ్చని గణాంకాలు చెబుతుండగా కార్పొరేట్ వైద్యం ప్రతిదానికి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, వైద్య పరీక్షల పేరుతో కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొల్లగొట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని ఆమె దుయ్యబట్టారు. కార్పొరేట్ వైద్యంలో సేవ లేదని వ్యాపారమే వారి లక్ష్యం అని డబ్బు సంపాదనకు ఎంతటి అన్యాయానికైనా కార్పొరేట్ వైద్యం పూనుకుంటుందని వివరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లా ఆసుపత్రులను ప్రైవేటుపరం చేయాలని అక్కడి ప్రభుత్వం పూనుకుంటే ప్రజలు తిరగబడ్డారని, దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం కేవలం ఒక జిల్లాలోని ఆసుపత్రిని మాత్రమే ప్రైవేటుపరం చేయగలిగిందని 9 ఆసుపత్రుల్లో ప్రజా వ్యతిరేకత కారణంగా వెనక్కు తగ్గిందని తాజా ఉదాహరణను ఆమె తెలిపారు. ప్రజలలో సైన్సును విస్తరింప చేయాల్సిన మీడియా, పలు మాధ్యమాలు దురదృష్టవశాత్తు శాస్త్రీయ అవగాహనకు ప్రోత్సాహం ఇవ్వకుండా పూజలు, మంత్రాలు, మందిరాల చుట్టూ తిప్పుతున్నాయని, కృత్రిమ మేధా విస్తృతమవుతున్న నేపథ్యంలో సాంకేతికతను అర్థం చేసుకోకుండా పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వైద్య విద్య అభ్యసించడానికి స్కాలర్షిప్ లు అందించి, వైద్యం నేర్చుకోవడానికి తగిన వసతులు కల్పిస్తే చాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో క్యాపిటేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేయాలని కోరారు. భారతదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలలో చదువుకొని ఉన్నత స్థాయి డాక్టర్లుగా పేరు పొంది, అమెరికాలో స్థిరపడిన కొందరు డాక్టర్లు ప్రైవేటీకరణ జబ్బుతో బాధపడుతున్నారని, ప్రభుత్వ రంగాన్ని తిట్టి పోస్తున్నారని, వీరికి ఈ రకమైన అభిప్రాయాలు చెప్పడానికి అర్హత లేదని ఆమె సూటిగా విమర్శించారు.

ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ పిలుపు
ఆరోగ్యమనేది మానవ హక్కుగా పరిగణించాలని ఆరోగ్యం వ్యాపారం కావడం అన్నది సమర్ధనీయం కాదని, ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్య రంగం – సామాజిక బాధ్యత అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రజలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా ఆరోగ్యాలను కాపాడుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఏ రకంగానూ ఉపయోగపడవని, ఇన్సూరెన్స్ రంగానికి ప్రజలను వదిలిపెట్టడం అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్నట్లేనని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ : అన్నారు. ఎపి లో ప్రజలందరికీ ఇన్సూరెన్స్ విధానం పరిష్కారం కాదని, ఆరోగ్య రంగంలో సమూలమైన మార్పులు రావాలని విద్య, వైద్యం మౌలికమైన హక్కులుగా పరిగణించబడాలని, ప్రాథమిక హక్కుగా ఉండాలని రమేష్ అభిప్రాయపడ్డారు. నేటి కాలం వైద్యరంగంలోని వారికి సవాళ్లతో కూడుకున్నదని, ఆరోగ్య సంరక్షణను వ్యాపారంగా మార్చి వేశారని ఆరోగ్యం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆయన సూచించారు. 2015వ సంవత్సరంలో దావోస్ కు తాను, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళామని ఆ సందర్భంగా తన సహచర ఐఏఎస్ కు జరిగిన ఓ ప్రమాదంలో గాయాలయ్యాయని ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాయాలకు గురైన అధికారికి ఎంత ఖర్చైనా పర్వాలేదు గొప్ప ప్రైవేటు వైద్యశాల ఎక్కడుందో తెలుసుకోమని కోరినప్పుడు, తాము స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రశ్నిస్తే ప్రైవేటు వైద్యమే తమ దేశంలో లేదని దావోస్ లోని ప్రభుత్వ వైద్యశాలే గొప్పదని వారు వివరించినప్పుడు తాము ఆశ్చర్యాన్ని గురయ్యామని గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యంగా ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఆరోగ్య పాలసీలు ప్రజల స్పందనను బట్టి నిర్ణయిస్తారని, మొదటి దశలో ఆరోగ్యం అందరికీ అన్న విధానం 100 ఏళ్ల కిందట మనదేశంలో లేదని మహమ్మారులు ఏర్పడినప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో, పాలకులు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మినహా తాము జీవించలేమని తెలిసి ప్రజలందరికీ ఆరోగ్యం అన్న విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఆరోగ్యం గురించి ప్రజలందరినీ చైతన్యం చేసే మాధ్యమం లేకపోవడం దురదృష్టకరమైందని అన్నారు. సంస్థలు తమ ప్రయోజనాలే కాకుండా ప్రజల ప్రయోజనాల కొరకు పని చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వృద్ధుల కొరకు జేరియా ట్రిక్, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య శాస్త్ర అధ్యయనం అత్యంత కీలకంగా మారనున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత విధానం ప్రకారం విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ వైద్య విద్యను ఇంజనీరింగ్ లో మాదిరే అమ్మకానికి పెట్టడం వల్ల ఇంజనీర్ల లాగే డాక్టర్లు ఉపాధి లేనివారిగా తయారవుతున్నారని, వారికి తగిన ఉపాధి చూపకుండా పెద్ద సంఖ్యలో పెంచు కోవడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. విజ్ఞానంతో నిమిత్తం లేకుండా డబ్బుతో కొనగలిగే వాళ్లందర్నీ డాక్టర్లుగా మార్చటం కారణంగా సమాజానికి ఏం తోడ్పడుతారని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాళ్ళు ఆ డబ్బు రాబట్టటం మీదే దృష్టి ఉంటుంది తప్ప సామాజిక బాధ్యతను ఎలా నెరవేరుస్తారని అన్నారు. ప్రజారోగ్య వేదిక, వేమన విజ్ఞాన కేంద్రం లాంటి సామాజిక, ప్రగతిశీల సంస్థల ఆధ్వర్యంలో ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల పట్ల పాలకులకు బాధ్యత పెరుగుతుందని ఆయన అన్నారు.
ఆరోగ్య భద్రతకై చట్టం చేయాలి: సదస్సులో తీర్మానం: ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య భద్రత చట్టాన్ని అమల్లోకి తేవాలని, ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా మార్చాలని, ప్రైవేటీకరణ పేరుతో ఆరోగ్య రంగాన్ని ధ్వంసం చేస్తున్న తీరు మానుకోవాలని ప్రజారోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ యం. వి. రమణయ్య ప్రజారోగ్య వేదిక ఇప్పటివరకు నిర్వహించిన సామాజిక బాధ్యతలను గురించి వివరించారు. కోవిడ్ కాలంలోనూ, తదనంతరం వైద్యరంగంలో విశేషమైన కృషి సల్పి ప్రజలను చైతన్యవంతం చేయటానికి తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారా ప్రజలకు నాణ్యమైన సమర్థవంతమైన వైద్యాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ డీన్ అల్లాడి మోహన్, శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.ఎ. చంద్రశేఖర్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ఎస్వీ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి. సత్యనారాయణ మూర్తి, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున, డాక్టర్ రవీంద్ర, ముఖేష్, ప్రసూన తదితరులతో పాటు ఎస్వీ మెడికల్ కళాశాల, ఆయుర్వేదిక్ కళాశాల, పద్మావతి మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థినులు వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..