

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమానుపాడు గ్రామంలో ఉన్న వివాదాస్పద క్వారీ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో క్వారీ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్వారీ ఏర్పాట్లు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్వారీ ఏర్పాటుతో వ్యవసాయం పనులకు ఆటంకం కలగడంతో పాటుతమ మూగజీవాలు, పశువులకు మేత సమస్యలు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే క్వారీ ఏర్పాటుకు ఎలా అనుమతులు ఇస్తారని అధికారులను నిలదీశారు. అలాగే ప్రజా ప్రతినిధులకు వినతులు సమర్పించారు. క్వారీ నిర్వాహకులు గ్రామస్తులతో రైతులతో పలుమార్లు చర్చించిన ప్రయోగం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలు మేరకు పోలీసు బందోబస్తు నడుమ క్వారీ వద్ద పనులు ప్రారంభించడంతో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో క్వారీ పనులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులను రైతులను హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా క్వారీ నుండి గ్రావెల్ తరలించేందుకు పనులు ప్రారంభించగా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం క్వారీ వద్దకు చేరుకున్న రైతులు అక్కడే శిబిరాలను ఏర్పాటు చేసుకొని నిరసనకు దిగారు. పోలీసులు శిబిరాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడే వంట వార్పు చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు శుక్రవారం రాత్రి క్వారీ వద్దే పడుకొని తమ నిరసనను తెలియజేశారు. క్వారీ ఏర్పాటుపై ఈనెల 24వ తేదీన కోర్టులో విచారణ జరుగుతున్నట్లు రైతులు తెలిపారు. క్వారీ ఏర్పాటుపై రైతులకు, క్వారీ నిర్వాహకులకు మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఇరువురికి ఈ విషయం ప్రతిష్టాత్మకంగా మారింది.