సిఎంగా చంద్రబాబు ప్రమాణం
పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం

చంద్రబాబు, టిడిపి నినాదాలతో మార్మోగిన సభ

ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు

ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది. గత ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్, మరో 23 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్, రవాణామంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్య క్షుడు జేపీనడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖనటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎల్జీపీ చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, మాజీ గవర్నర్ తమిళిసై, తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు నాయుడు.. నవ్యాంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. 1978లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారి గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. పవన్ తోపాటు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్. సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్ధన్రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలు గా గెలిచారు. కానీ మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా వీరికి ఆ అవకాశం లభించింది. మొత్తం గా 17 మంది కొత్తవాళ్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒకస్థానం కల్పించారు. మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు చేసిన చంద్రబాబు సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ జాబితాను రూపొందించారు. 24మంది చేత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమి చ్చారు. తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రివర్గంలో చేరారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కిం చుకున్నారు. భాజపా నుంచి సత్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కింది. ప్రమాణ స్వీకారం చేసినవారిలో పవన్ కల్యాణ్ (జన సేన), నారా లోకేశ్ (తెదేపా), అచ్చెన్నాయుడు (తెదేపా), కొల్లు రవీంద్ర (తెదేపా), నాదెండ్ల మనోహర్ (జనసేన), పి. నారాయణ (తెదేపా), వంగలపూడి అనిత (తెదేపా), సత్యకుమార్ యాదవ్ (భాజపా), నిమ్మల రామానాయుడు (తెదేపా), ఎన్.ఎమ్.డి ఫరూక్ (తెదేపా), ఆనం రామనారాయణరెడ్డి (తెదేపా), పయ్యావుల కేశవ్ (తెదేపా), అనగాని సత్యప్రసాద్ (తెదేపా), కొలుసు పార్థసారథి (తెదేపా), డోలా బాలవీరాంజనేయ స్వామి (తెదేపా), గొట్టిపాటి రవి (తెదేపా), కందుల దుర్గేశ్ (జనసేన), గుమ్మిడి సంధ్యారాణి (తెదేపా), బీసీ జనార్దన్ రెడ్డి (తెదేపా), టీజీ భరత్ (తెదేపా), ఎస్.సవిత (తెదేపా), వాసంశెట్టి సుభాష్ (తెదేపా), కొండపల్లి శ్రీనివాస్ (తెదేపా), మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (తెదేపా) ఉన్నారు. ప్రమాణం చేసిన వారంతా తెలుగులోనే దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఎన్ఎండి ఫరూక్ తెలుగులోనే అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. టిజి భరత్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం సిఎం చంద్రబాబు, ఇతర పెద్దలకు అభివాదం చేశారు. చంద్రబాబు పలువురిని మోడీకి పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ వేదికపై అందరికి అభివాదం చేసి, తన అన్న చిరంజీవికి మాత్రం పాదాభివందనం చేశారు.