నిబంధనలను పట్టించుకోని నాయుడుపేట సబ్ రిజిస్టర్

చేయి తడిపితే రిజిస్ట్రేషన్ చేసేందుకు సై సై..

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు నిలయంగా మారింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయవలసిన అధికారులు అందుకు పంగనామాలు పెడుతున్నారు. చేయి తడిపితే తాము ఏవైనా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ప్రభుత్వం మారిన తమ తీరును మార్చుకోవడం లేదు. ఏవైనా భూములు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది అవినీతి సంపాదన ధ్యేయంగా నిబంధనను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేస్తూ శాంతి భద్రతల సమస్యలను పరోక్షంగా సృష్టిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ చట్టని కూడా అతిక్రమించి వీరి అవినీతి కొనసాగిస్తున్నారంటే వీరి బరితెగింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అని ఇట్టే అర్థమవుతుంది. ల్యాండ్ టైటిల్ చట్టం ప్రకారం 2003వ సంవత్సరం పూర్వం అసైన్మెంట్ కమిటీ ఆమోదం ద్వారా ప్రభుత్వ భూమిని పొంది ఎలాంటి వివాదాలు అభ్యంతరాలు లేకుంటే రెవెన్యూ రికార్డులను పరిశీలించి రిజిస్ట్రేషన్ వచ్చే భూములు 2003 వ సంవత్సరం పూర్వం ఇచ్చి ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంది. కానీ నాయుడుపేట సబ్ రిజిస్టర్ అవినీతి దాహానికి ఇలాంటి నిబంధనలు అడ్డు రావడం లేదు. ఓజిలి మండలం వాకాటి వారి కండ్రిగ గ్రామంలో సర్వేనెంబర్:6-2 లో అసైన్మెంట్ భూములు ఉండగా వీటిని ఓజిలి మండలం రాచపాలెం గ్రామానికి చెందిన కీర్తిపాటి రామకృష్ణంరాజు స్వాధీనంలో ఉండేవి. 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా అర్హులైన పేదలకు పంచేందుకు ఈ భూములను స్వాధీనం చేసుకున్నారు. 2005వ సంవత్సరంలో వాకాటి వారి కండ్రిగ గ్రామానికి చెందిన రాయి పెంచలమ్మ అనే మహిళకు సర్వేనెంబర్:6-2 లో ఎ 02: 37 సెంట్లు అసైన్మెంట్ భూమిని అప్పటి వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయిన నేదురుమల్లి రాజ లక్ష్మమ్మ అధ్యక్షతన వెంకటగిరి మండల రెవెన్యూ కార్యాలయం లో జరిగిన అసైన్మెంట్ కమిటీ సమావేశంలో ఆమోద తీర్మానం పొందింది. అయితే ఈ అసైన్మెంట్ భూములను ఓజిలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరుతో ఓజిలి రెవెన్యూ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేసే వ్యక్తి ద్వారా పట్టా భూములుగా సొంత భూములుగా అడ్డగోలుగా రికార్డులు మార్చుకున్నారు. నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్టిఫికెట్ తీసుకొని కురుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణం లబ్ధి పొందారు. అడ్డదారిలో ఈ భూములు పొందిన వ్యక్తి ఓజిలి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ గొడవలు సృష్టించడంతో పాటు దళారి వ్యవహారాల ద్వారా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇంటి స్థలాల సర్టిఫికెట్లు తయారు చేస్తూ దందా చేశారు. ఇతని వెకిలి చేష్టల ద్వారా నష్టపోయిన కొందరు ఇతని వ్యవహారం పై నిఘా ఉంచి ఆరా తీయడంతో ఇతను అవినీతి దందాలు బయటపడ్డాయి. అసైన్మెంట్ తీర్మానం లేకుండా అడ్డదారిలో ప్రభుత్వ భూములను తన పేరుతో రికార్డులు సృష్టించుకున్న ఆ వ్యక్తి తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అహంతో విలువైన అసైన్మెంట్ భూములలో డాబాలు కట్టి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇతని వెకిలి చేష్టల వేధింపులతో ఇబ్బందులు పడ్డ ఓ వ్యక్తి ఇతని అవినీతి దందాలపై అప్పటి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారించి డాబాను తొలగించడంతోపాటు, రికార్డులలో ఇతని పేరు తొలగించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులను తనదైన శైలిలో మేనేజ్ చేయడంతో అధికారులు డాబాను కూల్చివేసి, సొంత భూములు కాలంలో ప్రభుత్వ భూములు అని సరిచేసి, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వ్యక్తి పట్టు విడవని విక్రమార్కుడిలా ఇతని పేరును రెవెన్యూ రికార్డులలో తొలగించాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇతని అవినీతి దందాలపై, అసైన్మెంట్ తీర్మానం లేని విషయం గురించి, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మహిళ పేరుతో పట్టాలిచ్చే నిబంధనను కలరాసి, ఇతని పేరుతో ఎలా పట్టా ఇచ్చారో అనే విషయం పై ఫిర్యాదు చేస్తే విఆర్ఓ, ఆర్ఐలు అతనికి విచారణకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా భారీ స్థాయిలో ముడుపులు పుచ్చుకొని జిల్లా కలెక్టర్కు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఫిర్యాది తిరుపతి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వివాదాస్పదమై సూళ్లూరుపేట రెవెన్యూ కోర్టులో విచారణలో ఉంది. వైసీపీ ప్రభుత్వ ల్యాండ్ టైటిల్ యాక్టు తీసుకో రావడంతో అర్హత లేని ఈ వ్యక్తి పేరును ఫ్రీ హోల్డర్ లిస్టులో చేర్చేందుకు అప్పటి తాసిల్దార్ భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని వీఆర్వోకు తెలియకుండా ఆర్.ఐ ద్వారా ఫ్రీ హోల్డర్ లిస్ట్ లో ఇతని పేరు పెట్టినట్లు సమాచారం. దీనిని అవకాశం తీసుకున్న ఈ వ్యక్తి రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాల అధికారులను మేనేజ్ చేసి గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు అసైన్మెంట్ భూములను అడ్డగోలుగా 70 లక్షల రూపాయలకు అమ్మివేశారు. అడ్డగోలు రిజిస్ట్రేషన్ పై నాయుడుపేట సబ్ రిజిస్టర్ సుమలతను ‘ప్రభాతదర్శిని-ప్రతినిధి’ వివరణ కోరగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, తమ సిబ్బందిని సంప్రదించాలని పరోక్షంగా భేరాసారాలకు దిగారు. కురుగొండ సొసైటీ లో అప్పు ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, రిజిస్టర్ అయిన భూములకు సొసైటీ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారా? అని ఎదురు ప్రశ్నలు వేశారు. కురుగొండ పిఎసిఎస్ సీఈవో రవీంద్రను వివరణ కోరగా తమ బాకీ చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమను నాయుడుపేట సబ్ రిజిస్టర్ తన కార్యాలయానికి వస్తే బకాయి కట్టిస్తామని కబురు పంపారని విషయం తర్వాత చెప్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం సీఈఓ రవీంద్ర ‘ప్రభాతదర్శిని- ప్రతినిధి’తో మాట్లాడుతూ లబ్ధిదారుడు తమ బాకీని ఆన్లైన్ ద్వారా చెల్లించారని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 18వ తేదీన చేసి జూలై ఒకటో తేదీన బకాయిలు చెల్లించడం చట్ట పరిధిలోకి వస్తుందా అని ప్రశ్నించగా… మాకు అవి అనవసరమని మా బాకీ మాకు వచ్చిందని వ్యాఖ్యానించారు.