అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా గూడూరు- కోట – వాకాడు- కోట – నాయుడుపేట ప్రాంతాల రోడ్లు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఈ రోడ్లు వారి హయాంలో సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పవచ్చు. నేదురుమల్లి, నల్లపురెడ్డి కాలం చెందిన తరువాత ఈ ప్రాంతంలో అభివృద్ధి కుంటు పడిందని, అభివృద్ధి పనులు కూడా సక్రమంగా జరగడంలేదని ఈ ప్రాంతీయులు అంటున్నారు. ముఖ్యంగా రోడ్లు పరిస్థితి మరింత దారుణంగా మారింది అని అంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. అందుకు ఉదాహరణగా తీసుకుంటే కోట పట్టణంలో రోడ్లు, కోట-నాయుడుపేట’ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. అలాగే చిట్టమూరు మండలం గునపాడు వరకు ఈ రోడ్డు నరకానికి నకళ్ళుగా ముఖ్యంగా కోట బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు ఐతే అడుగుకో గతుకు మీటరుకో గుంట.. వీటి నడుమ పెద్ద పెద్ద గోతులు.. వీటన్నింటినీ అధిగమించి కోట క్రాస్ రోడ్డు వరకు వెళ్ళగలిగితే వాళ్ళు మృత్యుంజయులే.. అంత దారుణంగా ఉంది రోడ్ల స్థితి…!మండల కేంద్రమైన కోటలో.. ఎప్పుడో దశాబ్దం క్రితం వేసిన రోడ్లు.. కాలక్రమేణా వర్షాలకు ఛిద్రమై నేటికి మరమ్మత్తులకు నోచుకోక అలాగే ఉన్నాయి.. కొత్తగా రోడ్లు వేసే సంగతి దేవుడెరుగు.. కనీస మరమ్మతులు నోచుకోలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు యేటా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని ఛిద్రమై లోతైన గుంటలు చిన్నపాటి కుంటలు, చెరువులను తలపిస్తున్నాయి. వర్షమొస్తే కనీసం రోడ్లపై నడక కూడా నరకప్రాయమవుతున్నది. ఈ నరకప్రాయమైన రోడ్లపైనే నుంచే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బ్యూరో క్రాట్స్, ఉన్నతస్థాయి అధికారులు తరచూ రాకపోకలు సాగిసస్తుంటారు. మరి ఈ రోడ్ల దుస్థితి వారు గమనించడం లేదా?చూడడం లేదా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్అండ్బీ అధికారులు అధికారులైతే పూర్తిగా నిద్రావస్థలో ఉన్నారు.. మీడియాలో కథనాలొచ్చినా కనీసం స్పందించరు.. క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించిన దాఖలాలూ లేవు.. కోటలోని ఆర్టీసీ బస్టాండు, విఘ్నేశ్వరుని స్వామి ఆలయం, ఎక్సట్రా మార్ట్, మండల కార్యాలయాలకు వెళ్లే మార్గానికి సమీపంలో.. ఇంకా విద్యానగర్-గూడలి రోడ్డు ప్రాంతాల్లో రోడ్డుపై పెద్దపాటి గోతులు ఏర్పడి మనిషి నడవలేని పరిస్థితులు దాపురించాయి. ఇక ద్విచక్రవాహనాలు, ఆటోలలో ప్రయాణించాలంటే అత్యంత కష్టతరంగా మారింది. రోడ్లు ఇంతలా చిద్రమైనా ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో విడ్డూరంగా ఉందని ప్రజలు వారి నిర్లక్ష్య వైఖరి ని తప్పు పడుతున్నారు. అడపా దడపా అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేసినా అవీ అంతంతమాత్రమే.. ఓ వర్షమొస్తే తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి.. ఎదురుచూసి ఎదురుచూసి చాలా సందర్భాల్లో స్థానికంగా ఉన్న స్వచ్చంధ సంస్థలు, వ్యాపారస్తులు చొరవ చూపి అనేక సందర్భాల్లో ఈ రోడ్డును తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి ఎంతోమంది ప్రమాదాల బారిన పడకుండా కాపాడారు.అంచనాలు-ప్రతిపాదనలకే నివేదికలు పరిమితమా?: కోటలో రోడ్ల నిర్మాణం ‘అంచనాలు-ప్రతిపాదనలు-నివేదికలకే పరిమితమై ఇలా ఏదో ఒక దశలో ఆగిపోవడమే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. కోట అనేది చుట్టుప్రక్కల మండలాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్నందున నిత్యం వందలాది వాహనాలు వస్తూ పోతుంటాయి.. ఛిద్రమైన రోడ్లతో వాహనాలు పాడవ్వడం, గుంతల్లో పడి విరిగిపోవడం జరగడంతో వాహనదారులు లబో దిబో మంటున్నారు. ద్విచక్ర వాహనదారులు కుటుంబ సభ్యులతో వెళుతూ ఈ రోడ్లపైని గుంతలు తప్పించబోయి.. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలబారిన పడుతున్నారు. కాళ్ళు చేతులు విరిగి.. అనేకమంది ఆస్పత్రుల పాలయ్యారు కూడా. కోటలో ఏళ్ళతరబడి ఇదే పరిస్థితి.. కోటలో ప్రస్తుతం ఇది ప్రధాన సమస్యగా మారినా అధికారులు, పాలకులకు ఏమాత్రం పట్టడం లేదు. ఇక ఆటోవాలాల బాధలైతే వర్ణనాతీతం.. ప్రయాణికులతో వెళ్తుంటే ఈ గుంతల్లో పల్టీ కొడుతుందేమోనని అనుక్షణం వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రహదారిపై వెళ్లే ప్రతి క్షణం.. భయమేస్తుంది.. ప్రభుత్వాన్ని, పాలకులనూ, ఆర్ అండ్ బీ అధికారులనూ తిట్టనివారంటూ ఉండరన్నది పచ్చి నిజం. మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది.. ప్రతి గుంట ప్రమాదానికి నిలయంగా మారిన నేపథ్యంలో స్థానిక నాయకులు, స్పందించి వెంటనే రోడ్లకు శాశ్వత మరమ్మత్తులు చేపట్టేలా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకునిరావాలని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలు, ప్రయాణికులు వేడుకొంటున్నారు.