టి.టి.యు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి
ప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి):సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ను వెంటనే ప్రకటించాలని టి.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొండికొప్పుల రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోజున సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి టి.టి.యు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా కొండికొప్పుల రవి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన పే స్కేల్, జీవిత భీమా , హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాలలో ఆనందాలు, వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నారని, వారికి పే స్కేల్ ప్రకటించి అందిస్తే వారు ఆనందంగా వారి వృత్తి నిర్వహణలో ప్రభుత్వానికి, ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకితభావంతో పాల్గొంటారని పేర్కొన్నారు. సమ్మె శిబిరాన్ని టి.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్, చిరంజీవి తదితరులు సందర్శించి సంపూర్ణ మద్దతును తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.