లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):లోక్సభ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక బుధవారం(జూన్ 26న) జరగబోతోంది. ఇప్పటి భారత వరకు లోక్సభలో ఈ తరహా ఎన్నిక జరగలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలో పోటీలో ఉన్న ఎన్ డి ఏ, ఇండియా కూటమి ఇద్దరు అభ్యర్థులు ఓం బిర్లా, కె.సురేశ్లకు పోల్ అయ్యే ఓట్ల లెక్కింపునకు విపక్షాలు సభలో పట్టుబట్టే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే లోక్సభ సభ్యులకు సీట్ల నంబర్ల కేటాయింపు జరగని కారణంగా ఈసారికి ఎలక్ట్రానిక్ డిస్ప్లే వ్యవస్థ ద్వారా ఓటింగ్ నిర్వహించే దాఖలాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఎంపీలకు కనీసం సీట్ల నంబర్లు లేకుండా ఎలక్ట్రానిక్ డిస్ప్లే వ్యవస్థ ద్వారా ఓటింగ్ నిర్వహించడం అనేది సాధ్యపడకపోవచ్చని, ఈసారికి స్పీకర్ ఎన్నికకు పేపర్ స్లిప్పుల ద్వారా ఓట్లు వేసే పద్ధతినే వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు. లోక్సభలో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ (272 స్థానాలు) ఉంటే, కేవలం ఏకగ్రీవ తీర్మానంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. దీని ఫలితం వెంటనే వచ్చేస్తుంది. ప్రస్తుతం సభలో ఏ పార్టీకి కూడా ఒంటరిగా 272 సీట్ల బలం లేనందున, పేపర్ స్లిప్పుల ద్వారా సేకరించే ఓట్లన్నీ లెక్కించి, ఫలితాన్ని ప్రకటించేందుకు కొంత సమయం పట్టొచ్చు. స్పీకర్ ఎన్నిక కు ఏన్డీఏకు వైసీపీ మద్దతు: ఇది ఇలా ఉంటే దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. లోక్ సభ స్పీకర్ ఎన్నికకు మద్దుతు కావాలంటూ బీజేపీ రిక్వెస్ట్ కు సానూకూలంగా స్పందించింది. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతివ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ… వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఈ అంశం బిజెపి మార్క్ రాజ “కీ” యం అని కొందరు అభివర్ణిస్తున్నారు.