ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట మండలంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో నాయుడుపేట ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం నాయుడుపేట మండలంలో ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్మడం జరుగుతుందని, ఆ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయుడుపేట మండలం విద్యాధికారి మునిరత్నం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు మాట్లాడుతూ
అధిక ఫీజులు వసూలు , పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయుడుపేట పరిధిలో పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు అమ్మకాల వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.కాగా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా విద్యాశాఖ అధికారులు అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు విక్రయిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యదర్శి వినయ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.