ప్రభాతదర్శిని, (ఒంగోలు-ప్రతినిధి): మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్‌ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాన్యానికి సూచనలు ఇచ్చారు. అలాగే, ఉర్వశి వైన్ షాప్ వద్ద బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత, ఒంగోలు డిపోను సందర్శించి, స్టాక్ రికార్డులను పరిశీలించారు. తదుపరి ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్‌ను కూడా సందర్శించారు. ఫిబ్రవరి 15న, నవోదయం 2.0 కార్యక్రమంపై అవగాహన కల్పించడం, ఆంధ్రప్రదేశ్‌ను అక్రమ మద్యం నుంచి విముక్తం చేయటమే ధ్యేయంగా అక్కడ ఒక ర్యాలీ నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.