సూపర్‌సిక్స్ అమలలో కూటమి ప్రభుత్వం మోసం
చంద్రబాబు, పవన్ విమర్శలు అనైతికం
ఎన్టీఆర్ మరణం, జూ.ఎన్టీఆర్ కారు ప్రమాదం కుట్ర కాదా?
:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజం
ప్రభాతదర్శిని (నెల్లూరు-ప్రతినిధి): ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కాస్తా.. సూపర్ ప్లాఫ్గా మారిందని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రంలో కోటి 47 లక్షల రేషన్ కార్డులుంటే వాటిరో అరకోటి మందికి మొండిచేయి చూపుతూ పథకాన్ని ఎగ్గొట్టారని, మరోవైపు మిగిలిన వారు కూడా తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేస్తే, తర్వాత అకౌంట్లో్ల వేయడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలను దగా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇంకా కూటమి పార్టీల్లో ఉన్న నేతల అవలక్షణాల గురించి సంస్కారం వీడి తాము మాట్లాడాల్సి వస్తే వారంతా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, తట్టుకోలేక అల్లాడాల్సిన దుస్థితి దాపురిస్తుందని, ఈ మేరకు రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కాస్తా ముందూ, వెనుక వారి కుటుంబాల గురించి ఆలోచించుకుంటే బాగుంటుదని సీఎం, డిప్యూటీ సీఎంకు కాకాణి గోవర్థన్‌రెడ్డి హితవు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, మా పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్, ఆయన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలపై పిచ్చి విమర్శలు తగవని, ఇక నుంచి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. లేకపోతే ప్రజల్లో తలెత్తుకుని తిరిగే అవకాశం లేకుండా తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, అందులో కుట్ర కోణం ఉందని టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటు అని కాకాణి మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు సంస్కారం తప్పి విమర్శలు చేస్తే, వాటికి తాము చేసే ప్రతివిమర్శలకు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను ఎవరు చంపేశారు? ఆయన ఎవరి వల్ల చనిపోయారు? ఆయన్ను శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు, ఆయన స్థాపించిన పార్టీని, పార్టీ గుర్తును, పార్టీ బ్యాంక్ ఖాతాలను ఎవరు, ఎలా చేజిక్కించుకున్నారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. అలాగే ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైతే, అది కూడా కుట్ర అనుకోవాల్సి వస్తుందని.. ఎందుకంటే భవిష్యత్తులో టీడీపీలో తనే, నారా లోకేష్‌కు అడ్డు వస్తాడన్న భయం వారిలో ఉందని మాజీ మంత్రి ప్రస్తావించారు. ఇంకా చెప్పాలంటే హరికృష్ణ, ఆయన కుమారుడు జానకిరామ్ మరణాల వెనకా కుట్ర కోణాన్ని ప్రస్తావించాల్సి వస్తుందన్న కాకాణి, మీ ఇంట్లో మహిళ ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుట్ర ఉందని ప్రచారం చేస్తే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎప్పుడూ సంస్కారంతో ఆలోచించే జగన్‌గారు, వ్యక్తిగత, కుటుంబ విమర్శలకు దిగరని చెప్పారు. చంద్రబాబు సహవాసంతో పవన్కళ్యాణ్కూడా గతి తప్పి మాట్లాడుతున్నారన్న మాజీ మంత్రి, షర్మిలకు భధ్రత కల్పించాల్సిన అవసరం ఆయనకు ఏముందని ప్రశ్నించారు. పవన్ కుటుంబం నుంచి గతంలో రోడ్డెక్కిన ఒక ఆడబిడ్డ, తనకు ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందంటూ బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఈ మాటలు మీకెంత బాధ కలిగిస్తాయో.. ఎదుటివారికీ అలాగే ఉంటుందన్న విషయం మరవొద్దని చెప్పారు. తొక్కి పెట్టి నార తీస్తా అంటూ పవన్ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెబుతున్నారన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి, అంతలా తొక్కి నార తీయాలనుకుంటే, ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే నేరాలు, ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని, వారికి ఆ పని చేయాలని.. అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ను తొక్కి పెట్టి నార తీయాలని సూచించారు.