టెలి కాన్ఫరెన్స్ ల్లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
ప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి): జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కే.జీ.బీ.వి , మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పిలుపు నిచ్చారు. కామన్ డైట్ మెనూ అమలు పై ఆయా విద్యాలయాల బాధ్యులు, ఇన్చార్జిలతో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ 14న ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెనూ కార్యక్రమం ప్రారంభోత్సవము ఉంటుందని తెలిపారు. కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించారు. హాస్టల్స్ లో కామన్ డైట్ వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి హాస్టల్ లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. కిచెన్ & డైనింగ్ ఎరియా నిర్వహణ మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వి.ఐ.పి. రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకుంటారని, 11 నుంచి 12 గంటల వరకు పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని, 12 నుంచి 12.30 గంటల వరకు పిల్లలతో ఇంటరాక్షన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అనంతరం కామన్ డైట్ ప్లాన్ సంబంధించిన హాండ్ బుక్ ముఖ్య అతిథి చే ఆవిష్కరించి ప్రసంగిస్తారని, అనంతరం 1 గంటలకు ముఖ్య అతిథి, పిల్లలు వారి తల్లిదండ్రులతో పాటు భోజనం చేస్తారని తెలిపారు.
మానాలలో హాజరు కానున్న విప్:రుద్రంగి మండలం మానాలలోని టీజీ టీడబ్ల్యూ ఆర్ఎస్ (గర్ల్స్) విద్యాలయంలో చేపట్టే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరు కానున్నారు. అలాగే తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని విద్యాలయంలో చేపట్టనున్న కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ దుమాల ఎల్లారెడ్డిపేటలో చేపట్టనున్న కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్, టీజీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ (గర్ల్స్) చిన్న బోనాలలో నిర్వహించనున్న కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా విద్యాలయాల్లో చేపట్టనున్న కార్యక్రమాలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆర్డీవోలు, ఆయా శాఖల జిల్లా అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. శనివారం నాడు కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు నాన్ వెజ్ ఆదివారం మెనూ తయారు చేయాలని సూచించారు. గతంలో ఉన్న డైట్ చార్జీలు 8 సంవత్సరాల తర్వాత 40 శాతం ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని, కాస్మెటిక్ చార్జీలను 16 సంవత్సరాల తర్వాత 200 శాతం పెంచిందని, పాఠశాలలో చదివి విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుందనే సందేశం ముఖ్య అతిథి మాట్లాడేలా చూడాలన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం గురించి తల్లిదండ్రులకు కామన్ డైట్ లాంచ్ సందర్భంగా తెలియజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే డైట్ ప్లాన్ అమలు అవుతుందని, పిల్లలకు పౌష్టిక, రుచికరమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాఠశాలలకు సరుకులు ఎలా వస్తున్నాయి? కిచెన్ లో ఎలా భద్రపరచాలి? విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఆదిత్య ఎందుకు తీసుకోవాల్సిన చర్యలు అంశాల పై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కిచెన్, డైనింగ్ ఏరియా లను శుభ్రం చేయాలని, ఆ ప్రాంతాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లో ఆయా శాఖల అధికారులు తదితరులు పాలుగోన్నారు.