ఓటేసిన పాపానికి ప్రజలను ఏపీలో వైసీపీ కాటేశారు: చంద్రబాబు స్పందన
ప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందని అన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఇది చారిత్రాత్మకం అని వివరించారు. కొందరు నేతలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి కొందరు నేతల వల్ల రాజకీయ కాలుష్యం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని అన్నారు. కొన్ని విధానాలవల్ల ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని తెలిపారు. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రానికి అన్ని రంగాల్లో మంచి పేరుండేదని, ఇవాళ పంజాబ్ అంటే డ్రగ్స్ గుర్తుకువస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. ఇటు, ఏపీలో వైసీపీ పాలనలో మద్యం మాఫియా తయారైందని ఆరోపించారు. ఏపీలో, ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని స్పష్టం చేశారు. ఏపీలోనూ, ఢిల్లీలోనూ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని, ప్రజల అవకాశాలను పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరుగుతూ ఉండాలని… కానీ ఏపీ, ఢిల్లీలో ఈ అంశాలు తిరోమగనం చెందాయని అన్నారు. అయితే… ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు వెల్లడించారు. గుజరాత్ లో సుస్థిర పాలన కారణంగా వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారు. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్ లో తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. మోదీ విధానాలు సరైనవని ప్రజలు నమ్ముతున్నారని, గుజరాత్ లో మోదీ తెచ్చిన విధానాలు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.
బాబు మాట‌కు జై.. బీజేపీకే తెలుగు ఓటు!:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట కు తెలుగు ఓట‌రు ఓటెత్తాడు. ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌సించాడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేవ‌లం కొద్ది గంట‌లు మాత్ర‌మే చంద్ర‌బాబు ప్ర‌చారం చేసినా.. ఆయ‌న ప్ర‌సంగాలు దుమ్ము రేపాయి. అప్ప‌ట్లోనే ల‌క్ష‌ల మంది ఢిల్లీ ప్ర‌జ‌లు ఆయ‌న ప్ర‌సంగాల‌ను విన్నారు. విక‌సిత భార‌త్ ల‌క్ష్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వేస్తున్న అడుగుల‌కు మ‌నం మ‌ద్దతివ్వాల‌ని.. భార‌త్ వికాసానికి మోడీ బ‌ల‌మైన నాయ‌కుడ‌ని చెప్పిన తీరు ఓట్లను కురిపించింది. తాజాగా వెల్ల‌డ‌వుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో చంద్ర‌బాబు ప్ర‌చారం చేసిన .. దాదాపు అన్నినియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. క‌మ‌లం పార్టీ అభ్య‌ర్థులు ముందంజ‌లో దూసుకుపోతున్నారు. షహారాబాద్, షాదారా, విశ్వాస్ నగన్‌, సంగం విహార్, సహద్రలో చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. మ‌రికొన్ని గంట‌ల్లోనే ప్ర‌చారం ముగిసిపోతుంద‌నగా.. సీఎం అక్క‌డ‌కు వెళ్లి.. ఆయా ప్రాంతాల్లో రోడ్ షో చేశారు. అదేవిధంగా స‌హ‌ద్ర‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లోనూ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మోడీ అవ‌స‌రం, బీజేపీ ప్రాధాన్యాన్ని వివ‌రించారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఇదేస‌మ‌యంలో ప్యాలెస్‌లు క‌ట్టుకున్న‌వారిని ఏపీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించి.. తిప్పి కొట్టి త‌రిమేశార‌ని.. ఢిల్లీ కూడా.. అద్దాల భ‌వంతులు క‌ట్టుకున్న కేజ్రీవాల్ వంటివారిని త‌రిమి కొట్టాల‌ని ఆయ‌న ఇచ్చిన పిలుపు.. ఓట్ల రూపంలో బ్యాలెట్‌ను బ‌ద్ద‌లు చేసింది. శ‌నివారం ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన క్ష‌ణం నుంచి బాబు ప్ర‌చారం చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ‌ల నాథులు దూసుకుపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది.
టీడీపీ జోష్‌..:చంద్ర‌బాబు ప్ర‌చారం చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ‌ల వికాసం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఏపీ, తెలంగాణల్లోని టీడీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి చేరుకుంటున్న సీనియ‌ర్ నాయ‌కులు.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు విన‌తిని గౌర‌వించిన ఢిల్లీలోని తెలుగు వారికి కృత జ్ఞ‌త‌లు తెలిపారు. చంద్ర‌బాబు మాట‌కు, ఆయ‌న పిలుపున‌కు స్పంద‌న మ‌రో 30 ఏళ్ల‌పాటు శాశ్వ‌త మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.