ప్రభాతదర్శిని(తిరుపతి – ప్రతినిధి):మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.అయితే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులని,ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా కోటి మందికి పైగా ప్రజలు తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలిచారని స్పష్టం చేశారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వలన దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందేలా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తృతంగా అభివృద్ధి చేశారని తెలిపారు.ఎంతోమంది పేద విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని,దీనివల్ల రాష్ట్ర విద్యార్థులు మన రాష్ట్రంలోనే చదువుకునే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతున్నా,అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు కేవలం 60 వేల లోపే ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలపై ఆధారపడాల్సి వస్తోందని,లేకపోతే విదేశాలకు వెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు.దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయని అని తెలిపారు.బెలారస్,ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లిన విద్యార్థులు రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఎదుర్కొన్న బాధలు దేశం మొత్తం చూసిందని తెలిపారు.ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పెరగాల్సిందేనని ఎంపీ స్పష్టం చేశారు.ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు,లండన్ హెల్త్ కేర్ సిస్టమ్‌ను మోడల్‌గా తీసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి గ్రామస్థాయి వరకు వైద్య సేవలు చేరేలా వ్యవస్థను మార్చారని వివరించారు.ఈ సంస్కరణలలో భాగంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కొన్నిటికే లభించినా, మిగిలిన కాలేజీలకు నాబార్డ్,సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ఆర్థిక సహాయం తీసుకొని వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తై, కొన్ని మెడికల్ సీట్లు కూడా అలాట్ అయినప్పటికీ,ప్రస్తుత ప్రభుత్వం ఆ సీట్లు వద్దని కేంద్రానికి రికమెండ్ చేయడం, ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపివేయాలని జీవోలు,సర్క్యులర్లు జారీ చేయడం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మద్దతు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు. స్టాండింగ్ కమిటీ రిపోర్టులను పూర్తిగా చదివితే నిజాలు బయటపడతాయని అన్నారు.స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నంబర్ 157 (ఫిబ్రవరి 9, 2024)లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ‘గోస్ట్ ఫ్యాకల్టీ’ వ్యవస్థ, అధిక ఫీజుల వసూలు, విద్యార్థులపై ఆర్థిక భారం వంటి అంశాలు స్పష్టంగా ప్రస్తావించబడ్డాయని గుర్తు చేశారు.అదే రిపోర్ట్ ప్రకారం ఎయిమ్స్, న్యూఢిల్లీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎంబీబీఎస్ ఫీజు రూ.1,350 మాత్రమే ఉండగా,కేజీఎంయూ లక్నోలో రూ.24 వేల వరకు ఉండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సంవత్సరానికి రూ.26.50 లక్షల నుంచి రూ.1.50 కోటి వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.తాను గత టర్మ్‌లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సభ్యుడిగా ఉన్నానని, కమిటీలో సభ్యుడిగా ఉండటం అంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు.స్టాండింగ్ కమిటీలు సలహాలు మాత్రమే ఇస్తాయని,అందులో ప్రతి సభ్యుడికి స్వతంత్రంగా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందని తెలిపారు.ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు,వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని,పేదలకు వైద్యం దూరమవుతుందని తాను అప్పుడూ, ఇప్పుడూ స్పష్టంగా వ్యతిరేకిస్తున్నానని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.
