ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబు
అధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలు
ఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి
సహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్న

ప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు. తాను కాకినాడ పోర్టుకు తనిఖీకి వస్తుంటే, మీరు రావొద్దంటూ కొందరు రాత్రివేళ ఫోన్లు చేశారని పవన్ వెల్లడించారు. మీరు వస్తే 10 వేల మంది జీవితాలు అతలాకుతలం అవుతాయని చెప్పారని వివరించారు. ఇక అక్రమ బియ్యంతో పట్టుబడిన నౌకను పరిశీలిద్దామనుకుంటే, ఆ నౌకలో మీరు పరిశీలించేందుకు, షిప్ లో పైకి ఎక్కేందుకు అనువైన పరిస్థితులు లేవని అధికారులు చెప్పారని… తనను నౌకలోకి తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిప్పారని పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను తనిఖీలకు వస్తుంటే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లిపోవడం అనుమానం కలిగిస్తోందిన అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అధికారులు మీకు సహకరించడంలేదని నిప్పులు చెరుగుతున్నారు కదా…! మీరు అధికారంలోనే ఉన్నారు కదా…! ఇప్పుడు మాకు అనుమానం వస్తోంది. మీరు వెళితే సహకరించవద్దని అధికారులకు చంద్రబాబు గానీ చెప్పారా? లేక, లోకేశ్ గానీ చెప్పారా? 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో తన పార్టీని గెలిపించిన వ్యక్తి, 100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ఉన్న వ్యక్తి… పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తి తనకు అధికారులు సహకరించడంలేదని చెబుతున్నాడు. అధికారులు సహకరించకపోతే మీరు ఏంచేయాలి? మీరు ప్రభుత్వంలో ఉన్నారా, లేక ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా? అనేది ఆలోచించుకోవాలి. మీరు కాకినాడ వెళ్లి సినిమా షూటింగ్ తరహాలో డ్రామా కార్యక్రమం చేశారు తప్ప, పీడీఎస్ బియ్యంను ఆపాలన్న చిత్తశుద్ధితో మీరు వెళ్లలేదు. పీడీఎస్ బియ్యం పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ, మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుని ఈ బియ్యం ఎగుమతులు చేస్తున్నారు. మీరు మాత్రం కాకినాడ వెళ్లి అక్కడి ఎస్పీ మీద, అధికారుల మీద కేకలు వేస్తున్నారు. కాకినాడ పోర్టులో రెండు చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు చెక్ పోస్టులు పౌరసరఫరాల శాఖకు చెందినవి. ఆ పౌరసరఫరాల శాఖను మీ పక్కన కూర్చున్న మనోహర్ నిర్వహించడం లేదా? ఆయన మీ పార్టీకి చెందినవారు కాదా? ఈ స్కాం నిజమైతే ముందు పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆ తర్వాత మీరు రాజీనామా చేయాలి. కానీ మీరు బాధ్యతలను విస్మరించి, ఎవరిపైనో విమర్శలు చేస్తున్నారు. ఓడిపోయిన చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడం వల్లే ఏమిటి ప్రయోజనం? మీరు ఇప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు… ఆ ఎస్పీని మీరే విమర్శిస్తారు, పౌరసరఫరాల శాఖను కూడా మీరే విమర్శిస్తారు, ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు… ప్రభుత్వంలో బాధ్యత మాదే అని చెబుతారు కానీ, ఆ బాధ్యతను చేపట్టే స్థితిలో లేరు… ఈ పరిస్థితి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా నాకు ఓ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. నాకు తిక్కుంది… దానికో లెక్కుంది… కానీ ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తిక్కుందని నాకు అర్థమవుతోంది” అంటూ పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.