ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ప్రకృతి ప్రకోపిస్తే.. వాన చినుకు విలయం సృష్టిస్తే.. కొండలు అమాంతం కదిలొస్తే.. కట్టుకున్న ఇళ్లను ఉన్నపళంగా కబళిస్తే.. ఇలాంటి ఊహ కవిత్వంలో మెదడులో మెదిలితేనే గుండె ఝల్లు మంటుంది. ఇలాంటి ఊహాలకు రెక్కలు తొడిగిన ఓ నిషా రాత్రి కేరళలో మట్టి చరియలు విరిగిపడి 123 మంది మృతి 128 మందికి గాయాలు కేరళలో జలప్రళయం 98 మంది ఆచూకీ గల్లంతు బురదలో కూరుకుపోయిన వందల మంది భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలం ఇళ్లు, వంతెనలు ధ్వంసం
వయనాడ్ ఊళ్లను మింగిన కొండలు: కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో ఓ గ్రామంలో ధ్వంసమైన ఇళ్లు.. కొట్టుకొచ్చిన బండరాళ్లు, అప్పటివరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయ నాదం చేశాయి.. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి.. ఇల్లు.. వాకిలి.. చెట్టు.. పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఈడ్చుకుంటూ పోయాయి.. వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి..నిమిషాల వ్యవధిలో ఊళ్లను.. శ్మశానాలుగా మార్చాయి.. కేరళ రాష్ట్రం వయనాడ్‌లో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇది. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వారిలో 123 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికితీశారు. గాయపడిన 128 మందిని ఆసుపత్రులకు తరలించారు. మరో 98 మంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడ్ విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు వయనాడ్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీ బుధవారం పర్యటించాలనుకున్నా ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. కోజికోడ్ ఉత్తర ప్రాంతంలోని విలాంగడు, మలయాంగడు గ్రామాల్లో కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఒకరు గల్లంతుకాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిద్రలో ఉండగానే…: సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్థులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్థులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. తొలుత మండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంత మంది బాధితులను సమీపంలోని చూరాల్‌మలలోని వెల్లారిమల పాఠశాలవద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చూరాల్‌మల గ్రామంలోని కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. మీడియాలో ప్రసారమైన ప్రమాదానంతర దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. బాధితుల ఫోన్ విజ్ఞాపనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన శునకాలను వినియోగిస్తున్నారు. 3,000 మందిని 45 శిబిరాలకు తరలించారు. చలియార్ నదిలో తేలియాడిన మృతదేహాలు: కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించి చాలా మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి కిలోమీటర్ల దూరంలో దాదాపు 16 మృతదేహాలను నదిలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటికి శరీర భాగాలు లేవు. నదిలో కొట్టుకొచ్చిన మూడేళ్ల పాప మృతదేహం స్థానికులను కలచివేసింది. అటవీ ప్రాంతంలోకి 5 మృత దేహాలు కొట్టుకు వచ్చినట్లు స్థానిక ఆదివాసీలు తెలిపారు. ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ కూడా నదిలో అనేక శవాలు తేలుతున్నట్లు ధ్రువీకరించారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి: కేరళ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
కేరళకు కేంద్రం భరోసా: సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన రెండు బృందాలను కేరళకు పంపారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లా డారు. కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.
పొరుగు రాష్ట్రాల ఆపన్నహస్తం: కేరళ ప్రమాదంపై పొరుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్రానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేరళ సీఎం విజయన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం నిధుల నుంచి రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కేరళ ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించాయి. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపాయి.
ఏకైక వంతెన ధ్వంసం:పర్యాటక ప్రాంతమైన మెప్పడిలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడి మండక్కైలోనే భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. చూరాల్‌మల వద్దనున్న ఏకైక వంతెన, ప్రధాన రహదారి ధ్వంసమయ్యాయి. దీంతో సహాయక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోలేక పోయారు. చివరకు హెలికాప్టర్లను వినియోగించాల్సి వచ్చింది. అవీ పరిమిత స్థాయిలో సేవలందించే పరిస్థితి నెలకొంది. ఈ హెలికాప్టర్లు కొండచరియలు పడిన ప్రాంతంలో దిగే పరిస్థితి లేకపోవడంతో కోజికోడ్‌కు తిరిగివెళ్లాయి. పనమరం, కరమాంతొడే, కబానీ నదుల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో బాణుసుర సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తేశారు. మెప్పడి రిసార్టులో 150 మంది. మెప్పడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్టులో 150 మంది చిక్కుకుపోయారు. రాత్రివేళ వర్షం పడుతుండటంతో కొందరు స్థానికులు అక్కడ తలదాచుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్: కేరళలోని 5 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటిలో మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసర్‌గోడ్, కన్నూరు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఎర్నాకులం, ఇడుక్కీ, త్రిశ్శూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
600 మంది వలస కార్మికులు ఎక్కడ?:వయనాడ్‌లో సహాయక చర్యలు ముందుకుసాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. మండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పని చేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా మండక్కైలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడతూ.. ‘మా కార్మికులను ఇప్పటి వరకూ సంప్రదించలేకపోయాం. దీనికితోడు మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు పనిచేయడం లేదు’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వయనాడ్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాల్లో తమ వారిని వెతుకుతూ బంధువులు ఆర్తనాదాలు మిన్నంటాయి.
ప్రకృతి ప్రకోపించే.. వాన చినుకు విలయం సృష్టించే…. ఊర్లను కబళించే…
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more