సిఐఐ తిరుపతి జోన్ వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి): తిరుపతి జిల్లా పారిశ్రామిక మార్పు అనే అంశాన్ని సిఐఐ చాలా సమయోచితంగా ఎంపిక చేసింది అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన CII తిరుపతి జోన్ వార్షిక సమావేశం 2025-26 సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా పారిశ్రామిక మార్పు అనే అంశాన్ని సిఐఐ చాలా సమయోచితంగా ఎంపిక చేసింది అని తెలిపారు. గత 15-20 సంవత్సరాల్లో నెల్లూరు, తిరుపతి , చెన్నై మధ్య ఉన్న ఈ త్రిభుజ ప్రాంతం పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సాధించిందనీ, 2000 సంవత్సరానికి ముందు ఈ ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు లేవన్నారు. అప్పట్లో లియో వర్క్స్, నాయుడుపేట, ఈఎంసి, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం రామాయపట్నం, గాజులమండ్యం వంటి ప్రాంతాలు వేగంగా ఎదుగుతున్నాయన్నారు. ఆహార ప్రాసెసింగ్ రంగం కూడా మొదటిదశలోనే ఉండేది. 2004 తర్వాత ఉద్యానవన రంగంలో సంస్కరణలు, మైక్రో ఇరిగేషన్ సదుపాయాల వల్ల మామిడి వంటి పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 2005–2015 మధ్య కాలంలో విస్తరించాయి అని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతాన్ని మ్యాప్‌పై గీసి, ఇక్కడ ఏర్పడే పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించారని, ఈ ప్రాంతం రాబోయే 10–15 సంవత్సరాల్లో దేశానికి ప్రధాన పారిశ్రామిక ఇంజిన్‌గా మారాలని వారి ఆకాంక్ష అని తెలిపారు. ఈ ప్రాంతం చెన్నై, బెంగళూరు వంటి రెండు మెట్రో నగరాలకు ఫీడర్ ప్రాంతంగా ఉందనీ, తిరుపతి, చెన్నై అనే రెండు విమానాశ్రయాలు, ప్రధాన పోర్టులు, బలమైన రైల్వే నెట్వర్క్, నాలుగు లైన్ల జాతీయ రహదారులు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఈ ప్రాంతానికి పెద్ద బలం అని అన్నారు. గతంలో తిరుపతి నుంచి నాయుడుపేటకు వెళ్లాలంటే రెండు గంటలు సమయం పట్టేదనీ ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం నుంచి కేవలం 50–55 నిమిషాల్లో చేరుకొనేలా జాతీయ రహదారి అభివృద్ధి చేయడం జరిగిందని, ఇది ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేసిందనీ అన్నారు. సాగరమాల రోడ్ల కింద నాలుగు ప్రధాన రహదారి ప్యాకేజీలు అమలులో ఉన్నాయనీ, ఒక్కో ప్యాకేజీకి సగటున రూ.1200, 1500 కోట్లు వ్యయం అవుతోంది. మొత్తం రూ.6000 కోట్లకు పైగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ఇప్పటికే దాదాపు పూర్తయిందనీ, మదనపల్లె తిరుపతి రోడ్డు, కడప–రేణిగుంట రోడ్డు వంటి అనుసంధాన మార్గాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అని తెలిపారు. తిరుపతి జిల్లాలో సుమారు రూ.6500 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. రేణిగుంట బైపాస్, ఏర్పేడు–పూడి గ్రీన్‌ఫీల్డ్ రైల్వే లైన్, తిరుపతి, కరకంబాడి డబ్లింగ్ వంటి పనులు కొనసాగుతున్నాయనీ అన్నారు. బెంగళూరు–చెన్నై, హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైలు మార్గాలు కూడా ఈ ప్రాంతం గుండా వెళ్లనున్నాయనీ, పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా పరిశ్రమలకు భూకేటాయింపులు వేగంగా జరుగుతున్నాయనీ, భూమి కేటాయింపులు పొంది ఇప్పటికే ఉత్పత్తినీ ప్రారంభించిన పరిశ్రమలను ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిందనీ,పర్యాటక రంగం కూడా తిరుపతి జిల్లాలో వేగంగా విస్తరిస్తుందని అన్నారు. తిరుపతి పట్టణంలోనే గత నాలుగేళ్లలో సుమారు 8900 హోమ్‌స్టేలు గలరని, వాటి ఆక్యుపెన్సీ రేటు సుమారు 65 శాతం ఉంది. నాలుగు, ఐదు నక్షత్ర హోటళ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయనీ, నోవోటెల్–ఐబిస్, కోర్ట్‌యార్డ్ మారియట్, లెమన్ ట్రీ ప్రీమియర్ వంటి హోటళ్లు త్వరలో సేవలు ప్రారంభించ నున్నాయని. తిరుపతిని డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక మండలి కేంద్రంగా ఇప్పుడు తిరుపతి జిల్లా ఉందనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సాధించాయని తెలిపారు. పరిశ్రమలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, పరిశ్రమల అభివృద్ధి అగ్ర ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఏ సమస్య వచ్చిన వాటి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జగన్నాథ అనిరుద్ చైర్మన్ సిఐఐ తిరుపతి జోన్ మేనేజింగ్ డైరెక్టర్, సిఐఐ ఏపీ ,సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ, సిఐఐ ఏపీ executive డైరెక్టర్ అపెక్స్ సొల్యూషన్ లిమిటెడ్ నరేంద్ర కుమార్, మాజీ చైర్మన్ సిఐఐ విశాఖపట్నం, శ్రావణ షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు, సిఐఐ తిరుపతి జోన్ రావండ్స్ కంట్రోల్ సీఈవో దామోదర నాయుడు, సిఐఐ తిరుపతి జోన్ ఎస్ పి రాజేంద్ర, అమర హాస్పిటల్ డా. రమాదేవి పాల్గొన్నారు.
