అమృత్ పథకం పనుల పురోగతిపై అధికారులతో చర్చించిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
ప్రభాత దర్శిని ( కావలి – ప్రతినిధి): కావలి, మార్చి 21 : కావలి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రారంభించిన అమృత్ పథకం మేలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా పైలాన్ ను పునః ప్రారంభిస్తామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు. శనివారం కావలి పోలీస్ అతిథి గృహంలో కమిషనర్ శ్రావణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు ఎ. గిరిధర్, పి సాయిరాంతో అమృత్ పథకం పనుల పురోగతి, నూతనంగా విడుదలైన నిధులు, యు వై డి ఎఫ్ ద్వారా మంజూరైన 22.8 కోట్ల నిధులు, ప్లాన్ గ్రాంట్ ద్వారా మంజూరైన 150 కోట్ల నిధులకు సంబంధించి 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం కావలి తాసిల్దార్ కార్యాలయం సమీపంలో అమృత్ పైలాన్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2015 – 16 లో చేసిన విన్నపాన్ని మన్నించి నాటి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో కావలి పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం అమృత్ పథకం క్రింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు జీ.ఓ నెం 323 , తేదీ : 29-08-2017 ద్వారా 59.30 కోట్ల రూపాయిలు మరియు మురుగు నీటి శుద్ధి కోసం జీ.ఓ నెం 82, తేదీ : 03-03-2017 ద్వారా 29.11 కోట్ల రూపాయిలు కలిపి మొత్తం 88.41 కోట్ల రూపాయలను అమృత్ 1.0 నిబంధనలు ప్రతికూలంగా ఉన్నా, వెంకయ్య నాయుడు అవసరమైన మార్పులు చేసి నిధులు విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ నిధుల ద్వారా కావలి పట్టణంలో అదనంగా 7,350 గృహాలకు నీటి సరఫరా కోసం వినియోగించడానికి 19.125 కి.మీ మేరకు పైప్ లైన్ నెట్వర్క్ కోసం వెంకయ్య నాయుడు చొరవతో జరుగుతున్న అమృత్ 1.0 పనుల అభివృద్ధి స్ఫూర్తికి గుర్తింపుగా 8 జనవరి 2018 న మంత్రి నారా లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారని చెప్పారు. అమృత్ 1.0 ద్వారా కావలి ప్రజలకు త్రాగు నీరు ఇవ్వాలని డబుల్ ఇంజన్ సర్కార్ 2017 లోనే నిధులు విడుదల చేస్తే, 2019 – 24 మధ్యలో గత ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయకుండా అమృత్ పథకం స్ఫూర్తి అయిన పైలాన్ ను 10 ఏప్రిల్ 2020 న గత ప్రభుత్వ నేతల ప్రోద్బలంతో కూల్చి వేశారు. తిరిగి 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమృత్ పథకం పనులను మళ్లీ ప్రారంభించామని చెప్పారు. అదేవిధంగా అమృత్ పథకానికి చిహ్నంగా నారా లోకేష్ ఆవిష్కరించిన పైలాన్ ను గత పాలకులు ధ్వంసం చేసిన స్థానంలోనే కావలిలో నేడు డబుల్ ఇంజిన్ సర్కార్ పునర్నిర్మించి ఆ స్ఫూర్తి చిహ్నాన్ని ప్రజల మనసులో నిలపడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ చొరవ తీసుకొని పైలాన్ పునర్నిర్మాణం చేపట్టారని, మరో 15 రోజుల్లో పైలాన్ పనులు పూర్తవుతాయని లంకా దినకర్ చెప్పారు. 88.41 కోట్ల రూపాయిల అమృత్ 1.0 నిధులతో 2019 ముందు చాలా వేగంగా పనులు జరిగాయి. 2019 – 24 మధ్య చాలా మందకొడిగా జరిగాయి. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. అమృత్ 2.0 క్రింద 14.26 కోట్ల రూపాయియాల పనులు ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం అవుతాయి.నేడు అమృత్ 2.0 లో మరలా ఇప్పుడు మరొక 14.26 కోట్ల రూపాయలను వెనుకబడిన వర్గాలు నివసించే కాలనీలలో త్రాగు నీటి మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అమృత్ పథకం నిధులు మాత్రమే కాకుండా మరో 22 కోట్ల రూపాయిల యుఐడీఎఫ్ నిధులతో పూర్తిగా కావలి పట్టణంలో కుళాయి ద్వారా సురక్షిత త్రాగు నీరు అందించే ప్రణాళికలను డబుల్ ఇంజన్ సర్కార్ తయారు చేసింది. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వికాసం కోసం నిరంతరం ప్రజ సేవే పరమావధిగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా లంకా దినకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు ఎ. గిరిధర్, పి సాయిరాం,మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.