ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వెంకటగిరి పట్టణానికి చెందిన యువ న్యాయవాది బీరం స్వాతి రెడ్డి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ నెల మార్చి 11 నుండి 13 వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆసియా–పసిఫిక్ ప్రాంతీయ ఐఎపి 12వ అంతర్జాతీయ సదస్సులో భారతదేశానికి ప్రతినిధిత్వం చేసే అవకాశాన్ని ఆమె పొందడం విశేషంగా నిలిచింది. ఈ సదస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రాసిక్యూషన్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన “ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్” ఆధ్వర్యంలో నిర్వహించగా, భారతదేశంలో తొలిసారిగా ఈ స్థాయి అంతర్జాతీయ సదస్సు జరగడం విశేషం. దేశీయంగా ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90కి పైగా దేశాల నుంచి న్యాయ నిపుణులు, అభియోగాధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు ప్రధాన అంశంగా “సరిహద్దులను అధిగమిస్తూ – న్యాయాన్ని సంరక్షించడం: గ్లోబలైజేషన్ యుగంలో అక్రమ వలసలు మరియు అంతర్జాతీయ నేరాలపై అభియోగాధికారుల ప్రతిస్పందన” అనే కీలక అంశంపై చర్చలు సాగాయి. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై బీరం స్వాతి రెడ్డి “అధికార పరిధులు పరస్పరం దాటిపడే ప్రాంతాల్లో, సామాన్య జాతి సమూహాలు మరియు సాంస్కృతికంగా మార్పులు చెందే సమాజాలలో నేరాలను అభియోగపరచడం” అనే అంశంపై తన ప్రసంగాన్ని సమగ్రంగా వినిపించారు. ఆమె ప్రసంగం అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలను పొందడమే కాకుండా, భారతదేశం తరపున ఆమె ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. స్వాతి రెడ్డి విద్యాభ్యాసం మరియు వృత్తి జీవితం కూడా ఎంతో ప్రేరణాత్మకంగా నిలుస్తుంది. వెంకటగిరిలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పదవ తరగతి వరకు చదువుకున్న ఆమె, అనంతరం నెల్లూరులోని శ్రీ చైతన్య విద్యాసంస్థలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తదుపరి తిరుపతిలోని గ్లోబల్ లా కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించి, చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ నుండి కాన్స్టిట్యూషనల్ లా మరియు ఇంటర్నేషనల్ లా విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. తన కృషి, పట్టుదలతో 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వెంకటగిరి మరియు కోట కోర్టుల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థకు సేవలందిస్తున్నారు. ఆమె ప్రతిభను ప్రతిబింబించే మరో ముఖ్య అంశం ఏమిటంటే, పిన్న వయస్సులోనే మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, వయస్సు పరిమితి కారణంగా నియామకం పొందలేకపోయారు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ముందుకు సాగి, తదుపరి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలు అందిస్తూ తన ప్రతిభను నిరూపించారు. చిన్న వయస్సులోనే న్యాయ రంగంలో విశిష్ట విజయాలను సాధించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బీరం స్వాతి రెడ్డి నేటి యువతకు, ముఖ్యంగా న్యాయ విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆమె సాధించిన ఈ విజయంపై స్థానిక ప్రజలు, న్యాయవర్గాలు మరియు విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
