ఆది నుంచి అంతం వరకు అన్ని అక్రమ మార్గాలే చోద్యం చూస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రభాతదర్మిని, (అమరావతి-ప్రత్యేక ప్రతినిధి): అవినీతి,అక్రమాలకు తావు లేకుండా సత్శీలమైన, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తామని 2024వ సంవత్సరంలో జరిగిన జమిలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు హామీలను గుప్పించిన ఉమ్మడి కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యాశాఖ పరంగా ఆ విషయాన్నే మరచి పోయారని నేరుగా పేర్కొనేందుకు ఇది ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకో వచ్చును. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో 2023వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ (ఆకు) నందు చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కొరడా ఝళిపించ వలసినది పోయి ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం పట్ల పలువురు విద్యా వంతులు, మేధావులు, నిరుద్యోగులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం బి.ఎడ్ ప్రాక్టికల్స్ పేరిట ఆకును నాకేసినట్లు, కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును ఆ నలుగురు ఉద్యోగులు(ముగ్గురు రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు) కూడబెట్టినట్లు తెలుస్తోంది.అత్యంత గోప్యంగా జరిగిన ఈ వ్యవహారం కాస్తా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు పనిచేస్తున్న అధ్యాపకులకు, అధికారులకు మధ్య చోటు చేసుకున్న బేధాభిప్రాయాల కారణంగా ఈ వ్యవహారం కాస్తా వాయువేగం, మనోవేగంతో అమరావతికి చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అమరావతి ప్రాంత విద్యా వంతులు, మేధావులు సమాచారాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తదితరుల దృష్టికి తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించిననూ సదరు అధినాయకులు అంతా ‘అమరావతి రాజధానికి చట్టబద్దత’ విషయంలో తలమునకలై ఉండటం వల్ల ఈ విషయంలో చేసేది ఏమీలేక సదరు వ్యక్తులు చేతులు నలుపుకుంటూ కూర్చున్నారని సమాచారం. గత మూడు సంవత్సరాల కాలం నుంచి ప్రభుత్వం ఈ విశ్వ విద్యాలయానికి నిధులేమీ కేటాయించక పోవడంతో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నుంచి నాలుగు రూపాయలు వెనుకేసు కోవాలని పలు హోదాలలో నియమితులైన ప్రొఫెసర్లు కొందరు అక్రమ మార్గంలో తమ జేబులను నింపుకునేందుకు మార్గాలను అన్వేషించడం, ఈ నేపథ్యం లో అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు ఉన్న 110 బి.ఎడ్,10 బి.పి.ఎడ్ కళాశాలల 4వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలను తమ ఆదాయానికి ప్రధాన వనరుగా ఎంపిక చేసుకోవడం తోబాటు ఎంతో ఐకమత్యం తో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా వారే నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. గత ఏడాది ఈ బి.ఎడ్ ప్రాక్టికల్స్ పేరిట ఆయా బి.ఎడ్ కళాశాలలకు చెందిన యాజమాన్యాల ప్రతినిధుల నుంచి 1.50 కోట్ల రూపాయల మేరకు అక్రమంగా వసూలు చేశారని అప్పట్లో బి.ఎడ్ స్క్వాడ్ డ్యూటీలు రానటువంటి పలువురు అధ్యాపకులు మీడియాకు సమాచారం అందించారు. ప్రాక్టికల్స్ అయిపోయిన తరువాత ప్రింట్ మీడియా నందు ఒక ప్రధాన పత్రికలో శీర్షిక వెలువడింది. ఆ సమయంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులు సదరు మీడియా సంస్థ ప్రతినిధికి కూడా ఇచ్చిన సమాచారం కూడా లోప బూయిస్టమని తెలిసింది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బి.ఎడ్ 4వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహిస్తారని వేయికళ్ళతో ఎదురు చూసిన బి.ఎడ్ కళాశాలల అధ్యాపకులకు నిరాశే మిగిలింది. ఈ విధంగా బి.ఎడ్ కళాశాలల అధ్యాపకుల నిరాశకు తోడు ఈ సంవత్సరం కూడా బి.ఎడ్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి స్క్వాడ్ డ్యూటీలు రానటువంటి అధ్యాపకులు (అసిస్టెంట్ ప్రొఫెసర్లు)ఒక కూటమిగా ఏర్పడి స్తానిక, రాష్ట్ర స్థాయి మీడియా ప్రతినిధులకు సమాచారాన్ని అందిస్తూ ఉండటంతో బి.ఎడ్ ప్రాక్టికల్స్ మాటున ఆంధ్ర కేసరి యూనివర్సిటీని ఆ నలుగురు అధికారులు ఏ విధంగా నాకేశారో డైరెక్టుగా చెప్పకనే చెబుతున్నారు.12 వేల మంది విద్యార్థులలో 100 మంది విద్యార్థులు కూడా ఫిజికల్ గా పరీక్షకు హాజరు కాకపోయినా, కేవలం పేపర్ల మీదే తతంగమంతా పూర్తి చేసి ప్రయోగ పరీక్షలకు గైర్హాజరు అయి ఇల్లదగ్గరే ఉన్న విద్యార్ధులకు అక్రమార్జన మాటున నూటికి నూరు శాతం మార్కులను అధికారులు అందించిన ఘనత మీద ఈ విషయం మీద పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, విద్యార్థి పరిరక్షణ సమితి నేతలు, విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాల ప్రతినిధులు నేరుగా గవర్నర్ నజీర్ అహ్మద్ తోబాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖ మంత్రికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆది నుంచి అంతం వరకు అన్ని అక్రమ మార్గాలే : విశ్వ విద్యాలయాల నిబంధనల ప్రకారం బి.ఎడ్ ప్రాక్టికల్స్ నిర్వహణలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ తోపాటు పీ.జీ కో ఆర్డినేటర్ లకు మాత్రమే పూర్తి స్థాయిలో నిర్వహణాధికారాలు అనగా కళాశాలలకు ఫేజ్ ల కేటాయింపులు, ఎక్స్టర్నల్ పరీక్షకుల నియామకాలు, స్క్వాడ్ నియామకాలు, ప్రయోగ పరీక్షలకు సంబంధించి మార్కుల నమోదు వరకు యూనివర్సిటీ స్థాయిలో వీరిదే ప్రముఖ పాత్రగా ఉంటోంది. అయితే ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు అంతా విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. బి.ఎడ్ ప్రాక్టికల్స్ పరీక్షలకు గాను నాన్ టీచింగ్ ఉద్యోగి స్థానంలో నియమించబడి ఉన్న కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ (సి.ఈ)కు ఎటువంటి అధికారాలు ఉండవు. అవి కేవలం బి.ఓ.ఎస్ చైర్మన్ సూచనల మేరకు, వారి నుంచి వచ్చిన అధ్యాపకుల సీనియారిటీ ప్రకారం మాత్రమే బి.ఎడ్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించ వలసి ఉంది. షెడ్యూల్ ఇచ్చి, సీనియారిటీ ప్రకారం ప్రయోగ పరీక్షకుల నియామకాలు, స్క్వాడ్ నియామకాలు చేపట్టేందుకు వీలుగా బి.ఓ.ఎస్ అధికారి తగిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో సదరు సీనియారిటీ ఆధారంగా పరీక్షకులను, స్క్వాడ్ డ్యూటీలకు ఇదే జాబితాలో అనగా బి.ఎడ్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, సీనియర్ అధ్యాపకుల్లో విశేషమైన అనుభవం ఉన్న వారిని మాత్రమే స్క్వాడ్ గా నియమించ వలసి ఉంటుంది. ఆపై ప్రయోగ పరీక్షల నిర్వహణ విషయంలో అజమాయిషీ అంతా బి.ఓ.ఎస్ సూచనల మేరకు పీజీ కో ఆర్డినేటర్ నేరుగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు గత రెండేళ్ల నుంచి బి.ఎడ్ ప్రాక్టికల్స్ విషయంలో ఎటువంటి అధికారాలు, సంబంధం లేకపోయినా సి.ఈ పోస్టులో ఉంటున్న అధికారి, స్థానికంగా నియమింపబడిన పీ.జీ కో ఆర్డినేటర్ ను లోబరచుకొని అక్రమ మార్గంలో డబ్బులు పోగుచేసి పెద్దవాళ్ళకు పంచి పెడుతున్నట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. పీ.జీ కో ఆర్డినేటర్ పోస్టు అనేది ప్రతి యూనివర్సిటీ నందు అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ స్థాయిలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగిని నియమించాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఈ పదవిని కట్టబెట్టిన ఆకు అధికారులు ఆయన ద్వారా అక్రమ మార్గంలో డబ్బులు వసూలు చేయడానికి నేరుగా గేట్లు ఎత్తి సదరు ఉన్నతాధికారులు మాత్రం ఒడ్డున ఉన్నారు. అయితే అంతిమంగా మాత్రం తిలా పాపం తలా పిడికెడు అనే సామెత మాదిరిగా బి.ఎడ్ ప్రాక్టికల్స్ నిర్వహణలో ఆయా కళాశాలల యాజమాన్యాల నుంచి 10 పిన్ పాయింట్ల ద్వారా అక్రమంగా తరలించిన సొమ్మును మాత్రం ఆ నలుగురు అధికారులు వారివారి స్థాయిలను బట్టి నిర్దేశించుకొని ఎంతో ఐకమత్యంతో పంచుకొని బి.ఎడ్ కళాశాలల అధ్యాపకులకు తీరని అన్యాయాన్ని.చేస్తున్నారు. స్క్వాడ్ నియామకంలనూ అనర్హులకే పెద్దపీట: బి.ఎడ్ ప్రాక్టికల్స్ నిర్వహణలో ఎదురవుతున్న లోపాలను సవరించి ప్రాక్టికల్స్ సజావుగా, సక్రమంగా నిర్వహించే విషయంలో యూనివర్సిటీ అధికారులు నియమించే స్క్వాడ్ సభ్యుల నియామకం లోకూడా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులు అనర్హులకు పెద్ద పీట వేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం స్క్వాడ్ నియామకాలు చేపట్టేందుకు వీలుగా బి.ఓ.ఎస్ చైర్మన్ ద్వారా సదరు యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని బి.ఎడ్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, సీనియర్ అధ్యాపకుల్లో అర్హత, అనుభవం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని జాబితాను తీసుకోవాల్సిన బాధ్యత పీ.జీ కో ఆర్డినేటర్ పై ఉంటుంది. బి.ఓ.ఎస్ చైర్మన్ సూచనల ప్రకారమే ఇక్కడ స్క్వాడ్ నియామకాలు జరగాల్సి ఉంటుంది. అయితే ఆంధ్ర కేసరి యూనివర్సిటీ (ఆకు) నందు మాత్రం అటువంటి నిబంధనలను ఏమాత్రం పాటించిన దాఖలాలు ఏమీ లేదని సమాచారం. ఇందుకు సంబంధించి ఆంధ్ర కేసరి యూనివర్సిటీ బి.ఓ.ఎస్ చైర్మన్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఎటువంటి సీనియారిటీ జాబితాలు గానీ, మార్గదర్శకాలను కానీ పీజీ కో ఆర్డినేటర్ పొందకుండా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా స్తానిక సి.ఈ తో కుమ్మక్కై నిబంధనలు పక్కన పెట్టేసి వారికి అనుకూలమైన వారికి స్క్వాడ్ బృందంలో అవకాశం కల్పించారు.ప్రస్తుతం ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు బి. ఎడ్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 8 మంది సభ్యులతో కూడిన 3 బృందాలను ఏర్పాటు చేయగా, వారిలో పశ్చిమ ప్రకాశంలోని ఓ బి.ఎడ్ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. మురళీ కృష్ణ మినహా, మిగిలిన 7 మంది స్క్వాడ్ సభ్యులు కూడా అనర్హులు అని చెప్పవచ్చు. వాస్తవానికి స్క్వాడ్ డ్యూటీలకు ఎం.ఎడ్ చదివిన వారిలో అనుభవం కలిగిన వారిని నియమించాల్సి ఉండగా, ఆకు అధికారుల ద్వారా నియమింపబడిన 7మంది అనర్హులలో ఏ ఒక్కరూ కూడా కనీసం బి.ఎడ్ కోర్సును కూడా చదవలేదు. ఇందులో కాసుల కక్కుర్తి ఏ విధంగా ఉందంటే మరొక విషయాన్నీ పరిశీలిస్తే ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. ఈ పరీక్షలకు ముందుగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ యూ. జీ విభాగంలో 4వ సెమిస్టర్ థియరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. అయితే ఈ యూ.జీ పరీక్షలకు ఒంగోలు లోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరిశీలకునిగా ఒకరిని, యూ.జీ స్క్వాడ్ డ్యూటీకి మరొకరిని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు పని చేస్తున్న అతిథి అధ్యాపకులలో ఇద్దరిని నియమించడం జరిగింది. అయితే ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉండగా, సదరు అతిథి అధ్యాపకులు ఇద్దరూ కాసులకు కక్కుర్తి పడి, అంతకు ముందు నియమింప బడిన యూ.జీ పరీక్షల విధులకు డుమ్మా కొట్టి వారికి గల పరపతిని పైరవీగా ఉపయోగించుకొని బి.ఎడ్ ప్రాక్టికల్స్ పరీక్షలకు ఫేస్ – 1 నందు మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరిగిన బి.ఎడ్ ప్రాక్టికల్స్ పరీక్షల విధుల్లో స్క్వాడ్ డ్యూటీలకు హాజరై యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరేమో ఇదేమిటబ్బా అని అంటూ ఉంటే, మరికొందరు మాత్రం అది అదేను అబ్బా అంటూ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రాంగణంలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరొక విషయం ఏమిటంటే ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు ఎం.ఎడ్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు (కాంట్రాక్టు)స్క్వాడ్ డ్యూటీలకు సంపూర్ణమైన అర్హతలు, అనుభవం కలిగి ఉన్నప్పటికీ కేవలం కలెక్షన్ల కోసమే తమకు నచ్చిన వారికి స్క్వాడ్ బృందంలో అవకాశం కల్పించారనేది అక్షర సత్యం. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే స్క్వాడ్ నియామకాలు చేపట్టే అధికారం పీజీ కో ఆర్డినేటర్ కు మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం సి.ఈ సర్వం తానై ప్రధాన భూమిక పోషిస్తూ అన్ని నియామకాలు చేపడుతూ ఉండగా, ప్రాక్టికల్స్ పరీక్షలు అన్నింటినీ కార్యస్థానంలో ఉంటూ పర్యవేక్షణ చేయాల్సిన పీజీ కో ఆర్డినేటర్ మాత్రం స్క్వాడ్ లీడర్ గా అవతారమెత్తి బి.ఎడ్ కళాశాలల యాజమాన్యాల నుంచి మిగిలిన రెండు స్క్వాడ్ బృందాల కంటే అధిక మొత్తంలో వసూలు చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కాకుండా కేవలం కాగితాల మీదే హాజరు, టీచింగ్ ఇతర వ్యవహారాలను తన కనుసన్నల్లో నడిపినందుకు ఒక్కో విద్యార్థికి 1000/- చొప్పున 12 వేల మంది విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం యాజమాన్యాలు ఇచ్చిన నజరానా తోపాటు పలు ప్రాంతాల్లో బి.ఎడ్ కళాశాలల యాజమాన్యాల నుంచి అధికారుల కోసం ఇచ్చినటువంటి నజరానా మొత్తం రమారమి 1.50 కోట్ల రూపాయలను 110 బి.ఎడ్ కళాశాలల యాజమాన్యాలు ఏర్పాటు చేసినటువంటి 10 పిన్ పాయింట్ల ద్వారా ఒక చోటకి చేర్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు పని చేస్తున్న పీజీ కో ఆర్డినేటర్ తన భుజ స్కందాలపైనే నడిపినట్లు పలు కళాశాలల యాజమాన్యాల ద్వారా తెలుస్తోంది. వాళ్ల జేబులు నింపుకొని… మా కడుపులు కొట్టారు: బి.ఎడ్ ప్రాక్టికల్స్ నిర్వహణ విషయంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులు అంతా ఒక్కటై వారి జేబులు నింపుకొని తమ కడుపులు కొట్టడమే కాక తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారని పలు బి.ఎడ్ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బి.ఎడ్ ప్రాక్టికల్స్ నిర్వహించే విషయంలో తప్పకుండా విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 12 వేల పైచిలుకు విద్యార్థుల్లో కనీసం ఒక్క శాతం కూడా హాజరు కాకపోయినా నూరు శాతం విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరు అయినట్లుగా అన్నీ పేపరులో చూపి భారీ స్థాయిలో అక్రమార్జనకు పాల్పడినట్లు బి.ఎడ్ కళాశాలల్లో పనిచేస్తూ ఖానీ జీతానికి కూడా దూరంగా ఉంటూ కేవలం ట్యూటీల కోసం ఎదురు చూస్తున్న అధ్యాపకులు పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంగా ఆకు అధికారులు బి.ఎడ్ ప్రాక్టికల్స్ నిర్వహణలో మయసభను చూపిస్తూ ప్రభుత్వం కళ్లుగప్పి కోట్లాది రూపాయలు అక్రమంగా డబ్బును సంపాదించుకొని సదరు సొమ్ముతో పై స్థాయి పదవులను పొందేందుకు శక్తి సామర్ధ్యాలు వినియోగించి పని చేస్తున్నారని పలువురు బి.ఎడ్ కళాశాలల అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.యాజమాన్యాల ద్వారా ఆర్థిక విషయాలలో ఆలనా పాలనా లేకపోవడం, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారుల అక్రమార్జనే పరమావధిగా భావించి న్యాయబద్ధంగా బి.ఎడ్ కళాశాలల సీనియర్ అధ్యాపకులకు,అధ్యాపకులకు రావాల్సిన డ్యూటీలు రాకపోవడంతో ఇటీవల కాలంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో గుర్తింపు పొందిన కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల్లో ఆర్థిక ఇబ్బందులు, ఆకలి కేకల కారణంగా ఇద్దరు అధ్యాపకులు మరణించారు. ఈ సంఘటనలు కూడా మరువక ముందే లక్షలాది రూపాయలను జీతాల రూపంలో స్వయంగా పొందుతున్న ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులకు కనువిప్పు కలగలేదంటే సదరు అధికారుల ధనదాహం ఏ స్థాయిలో ఉందో పాలకులే అర్థం చేసుకోవాలని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని పలు బి.ఎడ్ కళాశాలల అధ్యాపకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి ఈ అక్రమార్జనకు కారణ భూతమైన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సి.ఈ, పీజీ కో ఆర్డినేటర్ తదితరులను సర్వీసు నుంచి రిమూవ్ చేయాలని, అదే సమయంలో అక్రమార్కులతో చేతులు కలిపి అవినీతి అక్రమాలను నియంత్రించడంలో విఫలమైన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వి.సి, రిజిస్ట్రార్ లను విధుల నుంచి తొలగించాలని పలువురు మేధావులు, విద్యా వంతులు ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.