స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానం
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే సమీప పాఠశాలల్లో విలీనం
పాఠశాల విద్యలో మార్పు కార్యక్రమంలో కమిషనర్ : రాష్ట విద్యాశాఖ డైరెక్టర్

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు డా. ఎస్ వెంకటేశ్వర్, సుమిత్ కుమార్, తిరుపతి, చిత్తూరు జిల్లాల విద్యాశాఖాధికారులు కె వి ఎన్ కుమార్, వరలక్ష్మి, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎం లతో కలిసి ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ డైరెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో తీసుకొస్తున్న మార్పులు, జీఓ 117 రద్దు, నూతనం గా తీసుకొచ్చిన క్లస్టర్ విధానంతో కలిగే ప్రయోజనాలు తదితర వాటి గురించి కమిషనర్ వివరించారు. స్కూల్ క్లస్టర్ విధానంలో ఆ క్లస్టర్ పరిధిలోని స్కూళ్లపై మండల స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తున్నారని, దీని వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అందుకే క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చామని, దీని వలన ఆయా క్లస్టర్ పరిధిలోని స్కూళ్లపై ఆ క్లస్టర్ హెచ్ఎం ప్రతి రోజు పర్యవేక్షణ చేయడంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అయితే ఇక్కడ ఎం ఈఓలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ఉంటాయని, ఎవరు ఆందోళన చెందకూడదని, ఎంఈఓల పవర్స్ వారికే ఉంటాయని చెప్పారు.ఇకపై మండల విద్యాధికారుల బదిలీలకు కౌన్సెలింగ్ ఉండదని, తహసీల్దార్లు, ఎంపీడీఓల బదిలీల మాదిరిగానే ఉంటాయన్నారు. స్కూళ్ల ఎన్రోల్మెంట్లో తప్పులు ఉంటున్నాయని, వాస్తవమైన వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి పంచాయతీకి ఓ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు: ప్రతి గ్రామ పంచాయతీలో ఓ మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్య కమిషనర్ చెప్పారు. ఎక్కడైనా విద్యార్థులు తక్కువగా ఉంటే అక్కడి 3,4,5 తరగతులను 2,3 కి.మీ దూరంలో ఉండే మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పంపించేటట్లు అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించాలని, పిల్లలకు అవసరమైన రవాణా చార్జీలు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఇకపై కొనసాగించే ఉద్దేశం లేదన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ విధానంలో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటారని, పిల్లలకు కూడా మంచి విద్య అందుతుందన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లను బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేయాలని ఆదేశించారు. పాఠశాలల బలోపేతానికి కృషి… ప్రతి గ్రామంలో ఆదర్శ పాఠశాల: పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యా విధానాలు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని తెలిపారు. పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు,ప్రధానోపాధ్యాయుకు పిలుపునిచ్చారు. తిరుపతి చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జీవో నం.117 ఉపసంహరణ, అనంతరం పరిణామాలు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై చర్చించారు. ప్రతి గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న చోట రెండు గ్రామాలకు కలిపి ఒకే చోట ప్రాథమిక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో 80 మంది విద్యార్థుల సంఖ్య తగ్గకుండా పాఠశాలను ఏర్పాటు చేసి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలన్నారు. తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాల్లో బోగస్ విద్యార్థుల ఎన్రోల్మెంటు సంఖ్య 2 వేలకు పైగానే ఉందని, ఈ విషయంలో సంబంధిత అధికారులను, పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై వేటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బలోపేతమే లక్ష్యం: ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతుందని అన్నారు. విద్యను బలోపేతం చేసేందుకు మానవవనరుల విభాగంలో భాగస్వామ్యమయిన మేధావి వర్గంతో అవగాహనతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఎంపీయూపీ పాఠశాలలో 6, 7, 8 తరగతులు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. నూతన ప్రతిపాదిత విద్యావిధానంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా శాటిలైట్ ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ హైస్కూల్ పాఠశాలలను ఉన్నతీకరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య , గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ లు రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కడప ఆర్జేడీ శ్రీ శామ్యూల్, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.