శ్రీకాళహస్తి ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో తిరుపతి జిల్లా కలెక్టర్
ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, లాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రభుత్వం వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని, వైద్య సౌకర్యాలు ఏవైనా తక్కువ ఉన్నవాటిని నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డులో అడ్మిషన్ లో ఉన్న పేషెంట్ తో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని, డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని, ఆహారం ఆస్పత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడుగగా వారు ఎన్టీర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆహారం బాగుందని తెలిపారు. అనంతరం లేబరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు, తదితర ఎక్విప్మెంట్లు, రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిఎస్ ఆర్ఎమ్ఓ డాక్టర్ మధు తదితర వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. వైద్యులు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ కు తెలిపారు. ఆస్పత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలుపగా ఎమ్మెస్ఐడిసి అధికారికి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే కంటి ఆపరేషన్లు చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆప్తాల్మిక్ ఓటి సేవలు కంటి శాస్త్ర చికిత్సలు ఈనెల 20 వ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ప్రతి రోజు ఏరియా ఆసుపత్రికి సుమారు 500 పైన రోగులు ఓ.పి ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. డెంటల్ ఇంప్లాంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలుపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచనలు చేశారు. జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉన్నదని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డిప్యూటేషన్ చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.