వర్మ అసహనానికి కౌంటర్ గానే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ “శాశ్వత ఎమ్మెల్యే” వ్యాఖ్యలు చేశారా? ప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో):పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటారని, ఆయన చేస్తున్న అభివద్ధే అందుకు నిదర్శనమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఇప్పటికే 60,000 మందితో జనసేన ఒక బలమైన కుటుంబంగా మారిందని, త్వరలోనే లక్ష సభ్యత్వాల మార్కును చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదు, దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కూడా పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడుతూ, ఎంపీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించాయి. ఉప్పాడ బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసిన అనంతరం, పిఠాపురం నుండి గొల్లప్రోలు వరకు జనసైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలులో అట్టహాసంగా జెండా ఆవిష్కరణ జరిగింది. రాజకీయ వేడుకలతో పాటు సేవా నిరతిని చాటుకుంటూ, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ సహా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.అయితే, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యల వెనుక పిఠాపురం నియోజకవర్గంలో సాగుతున్న అంతర్గత రాజకీయ పోరు కారణమనే చర్చ నడుస్తోంది. ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంపై టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధికారులపై, జనసేన నేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లేని చోట టీడీపీ కార్యకర్తలకు స్థానం ఎక్కడిదని ఆయన ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వీడియో సోషల్ విÖడియాలో వైరల్ అయ్యింది. కూటమి నాయకులు రాష్ట్ర స్థాయిలో కలిసి ఉన్నప్పటికీ, పిఠాపురంలో మాత్రం టీడీపీ, జనసేన నేతల మధ్య ‘కోల్డ్ వార’ నడుస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వర్మ అసహనానికి కౌంటర్ గానే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ “శాశ్వత ఎమ్మెల్యే” వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. పిఠాపురంలో శుక్రవారం జరిగిన ‘స్వర్ణాంధ్ర`స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చాలా చిన్నదిగా ఉండటంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా మండిపడ్డారు. అధికారులే కూటమి పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. ఇది కేవలం తనను మాత్రమే కాకుండా, మూడు పార్టీల నాయకులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పిలిచి అవమానించడం తగదని సూచిస్తూ, అధికారుల తీరుకు నిరసనగా ఆయన సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు. వర్మకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా అధికారుల వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.పిఠాపురంలో వర్మ బలమైన నాయకుడు. గతంలో ఓసారి పార్టీ టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బలమైన నియోజకవర్గంగా మార్చారు వర్మ. అయితే రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తో టిడిపికి పొత్తు అవసరం. గత అనుభవాల దష్ట్యా పవన్ కళ్యాణ్ కు ఒక నియోజకవర్గం అవసరం వచ్చింది. అంతకుముందు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో 2024లో జాగ్రత్త పడ్డారు. అలా పిఠాపురం పై దృష్టి పడడంతో వర్మను సైడ్ చేయాల్సి వచ్చింది. బలమైన నాయకుడు కావడంతో ఆయన సాయం తీసుకోవాలని భావించి ప్రాధాన్యమిచ్చారు వర్మకు.. అయితే బలమైన హావిÖతోనే అప్పట్లో వర్మ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం ఉంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హావిÖ కార్యరూపం దాల్చలేదు. దీంతో రోజురోజుకు వర్మలో అసహనం పెరుగుతోంది. టిడిపి నాయకత్వం సైతం వర్మ విషయంలో నిస్సహాయతతో ఉంది.ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వర్మ కు ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఆపై పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీగా సరైన గౌరవం దక్కడం లేదు. ఈ తరుణంలో పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి మారింది. రాష్ట్రస్థాయిలో పొత్తు ఉండడం.. పవన్ కీలకంగా ఉండడం.. ఆయనకు కాదని వర్మకు పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో రోజురోజుకు పరిస్థితి శృతిమించుతోంది. అయితే పిఠాపురంలో తనకే కాదు చంద్రబాబుకు కూడా విలువ లేదని చెప్పేందుకే వర్మ అలా చేసి ఉంటారన్న టాక్ కూడా పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇప్పటికే పిఠాపురం అనేసరికి రకరకాల వివాదం నడుస్తూనే ఉంటుంది. ఒకానొక దశలో వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపో తారని కూడా ప్రచారం నడిచింది. పార్టీ కోసం కష్టపడిన తాను ఎందుకు గుడ్ బై చెబుతానని వర్మ ప్రశ్నించారు కూడా. అయితే తన ఆవేదనంత పార్టీ కోసమే అన్నట్టు ఇప్పుడు వర్మ ప్రవ ర్తన ఉంది. దీనిపై టిడిపి నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.