కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమయాత్ర
తరలివచ్చిన వామపక్ష నాయకులు, కార్యకర్తలు అభిమానులు
వైద్య కళాశాలకు దేహం అప్పగింత -నేతల ఘన నివాళి
ప్రభాత దర్శిని (నెల్లూరు బ్యూరో): ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా వ్యవస్థాపక నేత, మార్క్సిస్ట్ నేత జానా వెంకయ్య (78)బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు అభిమానులు, బంధువులు స్నేహితులు కన్నీటి వీడ్కోలు మధ్య బుధవారం సాయంత్రం జానా వెంకయ్య అంత్యక్రియలు జరిగాయి. జానా వెంకయ్యకు ఇటీవల ఆరోగ్యం బాగా లేకపోవడంతో నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేశారు. అందరూ ఆయన ఆరోగ్యం బాగానే ఉందనుకున్నారు. అనుకోకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు వెంకయ్య భౌతికకాయాన్ని నెల్లూరు మినీ బైపాస్ లో గోమతి నగర్ లో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన’మరణం వార్త తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు, స్నేహితులు హుటాహుటిన స్వగృహానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు టీ దయాకర్ తదితరులు ఆయన పార్టీవ దేహం పై ఎర్ర గుడ్డ కప్పి నివాళులర్పించారు అనంతరం ఆయన అంతిమయాత్ర బయలుదేరి మాగుంట లేఔట్ కెవిఆర్ పెట్రోల్ బంకు, బొల్లినేని ఆసుపత్రి, కొండాయపాలెం గేట్ సెంటర్ మీదగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు జోహార్ జోహార్ కామ్రేడ్ జానా వెంకయ్య అంటూ నినాదాలు చేశారు. అంతిమయాత్రలో జిల్లాలోని వివిధ ప్రాంతా లు, తిరుపతి, తదితరు ఏరియాల నుంచి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. వెంకయ్య సతీమణి భాగ్యలక్ష్మి టీచరుగా పనిచేశారు. ఆమె 2005 ఏప్రిల్ 9వ తేదీన జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు డాక్టర్ జానా చైతన్య కిషోర్ పశుసంవర్ధక శాఖ ఏడిగా , ఆయన కుమార్తె చైతన్య స్రవంతి వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నారు.
వెంకయ్య దేహం వైద్య కళాశాలకు అప్పగింత : జానా వెంకయ్య కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు ఆయన దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం ఏసీ సుబ్బారెడ్డి వైద్య కళాశాలకు సమర్పించారు. ఈ సందర్భంగా కళాశాల అనాట మీ విభాగం నిర్వాహకులు వెంకయ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
జానా వెంకయ్య మంచి కమ్యూనిస్టు: నెల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ వ్యవస్థాపకు లో ఒకరైన జానా వెంకయ్య మంచి కమ్యూనిస్టు, మంచి సైద్ధాంతిక వేత్త, పేదల పక్షపాతి అని సిపిఎం ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు కొనియాడారు. నెల్లూరు వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగిన వెంకయ్య అంతిమయాత్ర సభలో ఆయన మాట్లాడారు. పేదలను చైతన్యవంతం చేయడంలోనూ, వారిని వాము పక్ష ఉద్యమంలోకి తీసుకురావడంలోనూ వెంకయ్య సమర్ధుడైన నాయకుడని గుర్తు చేశారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి పైన ఉందని పిలుపునిచ్చారు.
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు : జానా వెంకయ్య తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను మరణించే వరకు పనిచేశారు. ఈ సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుపడాలని, కార్మిక కర్షక రాజ్యం రావాలని అందుకు కమ్యూనిజమే మార్గమని జీవితాంతం పనిచేశారు. నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామానికి చెందిన జానా వెంకయ్య డిగ్రీ వరకు చదివారు నెల్లూరు జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఎస్ఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. నీతి నిజాయితీ కి, నిరాడంబరతకు ఆదర్శంగా నిలిచారు. ఎంతో మందిని చైతన్యవంతులను చేసి ఎస్ఎఫ్ఐ ఉద్యమంలోకి తీసుకువచ్చినటువంటి ఘనత ఆయనది. ఆయన ఎఫ్‌సీఐలో ఉద్యోగంలో చేరినప్పటికీ వామపక్ష ఉద్యమ అభివృద్ధికి పరోక్షంగా సహకరించారు. ఆయన పని చేసిన ప్రతి చో టా వామపక్ష ఉద్యమ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన పేదల పక్షపాతి ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి, అభ్యుదయ ఉద్యమానికి తీరని లోటు.
