రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం సీఎం చంద్రబాబుతో భేటీలో మంత్రి తుమ్మలకీలక విజ్ఞప్తులు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఖమ్మం జిల్లాకు సంబంధిచిన సాగునీటి వసతులు, భక్తులు మరియు ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేసారు. రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అయిదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటం వల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ చర్య కీలకమని తెలిపారు. అదే విధంగా, ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అని తెలిపారు. ప్రాజెక్ట్ శాశ్వత పునరుద్ధరణకు సుమారు రూ.92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిందని, రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సాగు, జీవనాధారం ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉన్నందున తక్షణ ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఈ రక్షణ గోడలో జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారితీయొచ్చని పేర్కొన్నారు. కరకట్టలోని ఆ భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. తక్షణ సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తైందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. స్థానిక భక్తుల దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రి ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వసతి కొరతను తగ్గించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందిస్తే సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు మౌలిక వసతుల విస్తరణలో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.