ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) : ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి నాగరాజు కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిడి నాగ శేఖర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీధర్ రెడ్డి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా భూసమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు మరియు పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను బియాండ్ యస్.యల్ .ఏ పోకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లును జిల్లా అధికారులు చేపట్టారు. వీటిలో సహాయకులతో కూడిన అర్జీ స్వీకరణ కౌంటర్లు, రిసెప్షన్ సదుపాయం, జిల్లా మరియు మండల స్థాయి అధికారుల హాజరు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, అర్జీల పర్యవేక్షణ, ప్రత్యేక క్యూ లైన్లు తదితర ఏర్పాట్లు చేయడంతపాటు షామ్యానలు వేసి నీడను కల్పించారు. సోమవారం జరిగిన ప్రజాపిర్యాదుల పరిష్కార వేదికలో నూతనంగా ఫిర్యాదుల స్వీకరణ త్వరితగతిన పరిష్కారానికి డివిజనుల వారీగా రెవెన్యూ క్లినిక్ ప్రత్యేక కౌంటర్లను తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసి అర్జీల సత్వర పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాఅధికారులు పాల్గొన్నారు.