
వి.ఎస్ యు వి.సి ఆచార్య ఎస్.విజయభాస్కర రావు
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్నెట్ లావాదేవీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విక్రమ సింహపురి యూనివర్శిటి ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు అన్నారు. మంగళవారం ఉదయం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వి.ఎస్ యూ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఎన్.ఐ.సి సంయుక్త ఆధ్వర్యంలో సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం-2025 అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విసి ఆచార్య ఎస్.విజయభాస్కర రావు మాట్లాడుతూ రోజురోజుకి పెరుగుతున్న ఇంటర్నెట్ ఆన్లైన్ వినియోగంతో ప్రయోజనాలతో పాటు సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయన్నారు. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది మనిషి జీవనగమనంలో ఒక భాగంగా మారిపోయిందన్నారు. ఇంటర్నెట్ వినియోగం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ నగదు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచంలోని అత్యంత ఎక్కువగా యూపిఐ నగదు లావాదేవీలు భారత దేశంలోనే జరుగుతున్నాయన్నారు. వీసీ, ఓటీపీ, డెబిట్, క్రెడిట్ కార్డుల సివివి నెంబర్లు, వ్యక్తిగత పాస్వర్డ్లు, యూజర్ ఐడిలు అత్యంత భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆన్లైన్ లావాదేవీలను పట్ల జాగ్రత్తగా ఉండి, ధ్రువీకరించుకున్న తరువాతనే చేయాలన్నారు. యువత ఆన్లైన్ ద్వారా సులభంగా వచ్చే డబ్బులకు ఆశపడి సైబర్ మోసాల బారినపడుతున్నారని అన్నారు. వీటిపట్ల అవగాహనతో జాగ్రత్తగా ఉండాలని అన్ని లావాదేవీలను సురక్షితమైన పద్ధతుల్లోనే చేయాలని కోరారు. తొలుత ఎన్ఐసి సమాచార అధికారి వి.సురేష్ బాబు సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఫేక్ వెబ్సైట్లు, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్‌లు, ఆన్లైన్ మోసాల బారినపడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ మోసాలను ఎలా గుర్తించాలి, సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగ పద్ధతులు మొదలైన అంశాలపై క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ పి.శ్రీకాంత్ ప్రదీప్‌కుమార్, సైబర్ క్రైం ఎస్ఐ పి.శ్రీనివాసరెడ్డి ఆన్లైన్ మోసాలను విద్యార్థులకు విపులంగా వివరించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు ఫోన్ చేసి ఓటీపీలు, బ్యాంకు అకౌంటర్, సీవీవీ నెంబర్లు తెలివిగా అడుగుతారని, వీరిపట్ల జాగ్రత్తగా వుండాలని, వీటిని ఎవరికి చెప్పవద్దన్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 నెంబరుకు లేదా బ్యాంకును సంప్రదించాలని సూచించారు. ఫోన్‌చేసి లాటరీ వచ్చిందని, బహుమతి గెలుచుకున్నారని కొంతమొత్తం ట్యాక్సులు కడితే మీకు డబ్బులు ఇస్తామని జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలన్నారు. యువత అందరూ సులభంగా వచ్చే డబ్బుకు ఆశపడితే ఊహించని పరిణామాలతో నష్టపోయి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులుపడాల్సి వస్తుందన్నారు. అలాగే తెలియని నెంబర్ల ద్వారా వచ్చే కాల్స్ వల్ల ఇతరులతో వీడియోకాల్స్ మాట్లాడడం, వ్యామోహాలకు లోనైతే సైబర్‌నేరగాళ్లు మన జీవితాలను నాశనం చేస్తారని, వీటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఆచార్య అందె ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు డాక్టర్ జి.విజయలక్ష్మి, డాక్టర్ ఎం.హుస్సేనయ్య, జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ అధికారి కె.సదారావు, జిల్లా నెహ్రూయువకేంద్రం అధికారి ఎ.మహేంద్రరెడ్డి, ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.